డా. దత్తాత్రేయుడు నోరికి పద్మభూషణ్ రావడం దేశానికే గర్వకారణం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా

తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు (వైధ్యం), ప్రముఖ ఆంకాలజిస్ట్, క్యాన్సర్ వైద్య నిపుణులు డా. దత్తాత్రేయుడు నోరికి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని ప్రదానం చేయడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. వైద్య రంగంలో ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా దక్కిన ఈ పురస్కారం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, డా. నోరికి హోంమంత్రి ఒక ప్రత్యేక అభినందన లేఖను పంపారు. క్యాన్సర్ చికిత్స, పరిశోధన రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా కొత్త ప్రమాణాలు నెలకొల్పి, ఎంతో మందికి పునర్జన్మ ప్రసాదించిన డా. నోరి సేవలను అమిత్ షా ఈ లేఖలో విశేషంగా కొనియాడారు. విజ్ఞానం, సేవ, సహానుభూతి కలబోసిన ఆయన వైద్య ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ​ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పద్మ పురస్కారాలకు సరికొత్త అర్థం చేకూరిందని హోంమంత్రి స్పష్టం చేశారు. కేవలం ప్రశంసల కోసం కాకుండా, సమాజ శ్రేయస్సే ధ్యేయంగా పనిచేసే నిజమైన మౌన సాధకులకు, కర్మయోగులకు నేడు ఈ జాతీయ పురస్కారాలు దక్కుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రోగుల సంక్షేమం పట్ల డా. నోరి కనబరుస్తున్న అంకితభావం కేవలం ఒక వ్యక్తిగత విజయం కాదని, అది స్వార్థరహిత విలువలపై నిలబడి దేశ ప్రగతికి దిశానిర్దేశం చేసే దేశభక్తికి నిదర్శనమని హోంమంత్రి అన్నారు. పరోపకారం విశిష్టతను తెలిపే సంస్కృత శ్లోకాన్ని ఉదహరించిన అమిత్ షా… డా. నోరి సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో మరింత కాలం పాటు సమాజానికి తన అమూల్యమైన సేవలను అందించాలని ఆకాంక్షిస్తూ తన లేఖను ముగించారు.