22ఏ భూముల పేరిట ఒక్క అర్హుడికీ అన్యాయం జరగదు

  • కొత్తగా ఒక్క సెంటు భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదు
  • ప్రభుత్వ ఆలోచనను అర్థం చేసుకొని అదే స్ఫూర్తితో పనిచేయాలి
  • అర్హులైన వారి హక్కులను కాపాడుతూనే ప్రభుత్వ భూములను పరిరక్షించాలి
  • 22ఏ దరఖాస్తులు, ఫిర్యాదులను నిర్ణీత గడువులోనే పరిష్కరించాలి
  • రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టమైన ఆదేశాలు

హైదరాబాద్,:- రాష్ట్రంలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో ఏ పేదవాడికీ, ఏ నిజమైన భూహక్కుదారుడికీ అన్యాయం జరగకుండా చూడటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన వారి హక్కులను కాపాడటం, అదే సమయంలో ప్రభుత్వ భూములను రక్షించడం అనే రెండు లక్ష్యాలతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా ఒక్క సెంటు భూమిని కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చలేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఎన్నడూ లేదని, వివాదాలు లేని ప్రైవేట్ భూములను నిషేధిత జాబితాలో చేర్చిందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో క్యూర్ పరిధిలోని 22ఏ నిషేధిత భూములకు సంబంధించి వివిధ మాధ్యమాల్లో వచ్చిన కథనాలు, ప్రజల ఫిర్యాదులు, హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ విధానాలపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి శేషాద్రి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, మేడ్చల్–మల్కాజిగిరి అదనపు కలెక్టర్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ సమావేశం క్యూర్ పరిధి జిల్లాలకు సంబంధించినదైనా, ఇందులో ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలి
22ఏ అంశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌లు, సూచ‌న‌లు అనుగుణంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని అధికారులు పూర్తిగా అర్థం చేసుకుని అదే స్ఫూర్తితో పనిచేయాలని ఆదేశించారు. అర్హులైన వ్యక్తికి న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత. అదే సమయంలో ప్రభుత్వ భూములు కాపాడటం కూడా అంతే ముఖ్యమైన బాధ్యత అని అన్నారు.నిషేధిత జాబితాలో ఉన్న భూములను సమగ్రంగా పరిశీలించి, చట్టబద్ధంగా, నిబంధనల మేరకు అర్హత ఉన్న భూములను గుర్తిస్తూ, ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కేసును వాస్తవాలు, రికార్డులు, చట్టపరమైన అంశాల ఆధారంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. 22ఏకు సంబంధించిన దరఖాస్తులు, ఫిర్యాదులు ఏ స్థాయిలో వచ్చినా పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని మంత్రి స్పష్టం చేశారు. తహసీల్దార్, ఆర్డీవో, సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ స్థాయిలో వచ్చే ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేయాలని సూచించారు. ప్రజావాణిలో ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను కూడా ప్రత్యేక దృష్టి సారించి, వెంటనే విచారణ పూర్తి చేసి విధిగా ప‌రిష్క‌రించాలని ఆదేశించారు. 22ఏ భూములకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి హైకోర్టు నిర్దేశించిన 45 రోజుల గడువులోనే అన్ని ప్రక్రియలు పూర్తి చేసి తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 22ఎ కు సంబంధించిన కేసుల‌లో కోర్టు ఆదేశాలను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ప‌రిష్క‌రించాల‌ని ప్రజలకు న్యాయం జరిగేలా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడం ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములపై అక్రమ లావాదేవీలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, ఆక్రమణలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. 22ఏ జాబితాలో ఉన్న భూములపై సమగ్ర పరిశీలన చేసి తుది నిర్ణయం తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు ఉందని గుర్తుచేస్తూ, ప్రజల హక్కులు – ప్రభుత్వ ప్రయోజనాలు రెండింటినీ సమతుల్యం చేస్తూ పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.