హైదరాబాద్ : భారత ప్రభుత్వ కేబినెట్ కార్యదర్శి డా. టి.వి. సోమనాథన్ సోమవారం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన “రిఫార్మ్ ఉత్సవ్ (Reform Utsav)” కార్యక్రమం అమలు, కార్యాచరణపై రాష్ట్రాలకు వివరించారు. అక్టోబర్ 2026 నుంచి రిఫార్మ్ ఉత్సవ్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు కేబినెట్ కార్యదర్శి తెలిపారు. ప్రజల అభిప్రాయాలు, సూచనలను సేకరించి, వాటిని ఆచరణాత్మక సంస్కరణలుగా మార్చి, నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికతో అమలు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రిఫార్మ్ ఉత్సవ్‌ను మూడు దశల్లో అమలు చేయనున్నారు. మొదటి దశగా ఆగస్టు–సెప్టెంబర్ 2026లో సన్నాహక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందులో పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు, అధికారుల సెన్సిటైజేషన్, ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు ఉంటాయి.
రెండో దశ అక్టోబర్–డిసెంబర్ 2026లో రిఫార్మ్ ఉత్సవ్‌గా నిర్వహించనున్నారు. ఇందులో జన్ మంథన్ (Discover) కార్యక్రమం అక్టోబర్ 1 నుంచి 31 వరకు, విమర్శ్ (Deliberate) – జన్ సమాధాన్ (Deliver) కార్యక్రమాలు అక్టోబర్ 10 నుంచి నవంబర్ 30 వరకు నిర్వహించి, త్వరితగతిన అమలు చేయగల సంస్కరణలు, మధ్యకాలిక సంస్కరణలపై దృష్టి సారించనున్నారు. సంకల్ప సిద్ధి కార్యక్రమం అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 20 వరకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్నారు. మూడో దశగా డిసెంబర్ 28, 2026 నుంచి తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఇందులో నిర్మాణాత్మక సంస్కరణలపై నిరంతర పర్యవేక్షణ, తదుపరి చర్యలు మరియు ARTs సమర్పణ ఉంటాయి. రిఫార్మ్ ఉత్సవ్ అమలుకు ప్రతి రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన స్టేట్ కోఆర్డినేటివ్ కమిటీ (SCC) ఏర్పాటు చేయడంతో పాటు స్టేట్ నోడల్ ఆఫీసర్ (SNO)ను, జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమించనున్నారు. సంబంధిత రాష్ట్ర శాఖలు, లైన్ డిపార్ట్మెంట్ల ద్వారా కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా “రిఫార్మ్ ఉత్సవ్ పోర్టల్”ను ప్రారంభించనుంది. ఈ పోర్టల్‌లో ప్రజల భాగస్వామ్యం, సూచనల సేకరణ, సంస్కరణల పర్యవేక్షణకు అవకాశం కల్పించడంతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో పాటు నవీన్ మిట్టల్, స్టీఫెన్ రవీంద్ర, IPS, బి. పాపిరెడ్డి, లా సెక్రటరీ, అనుదీప్ దురిశెట్టి, అహ్మద్ నదీమ్, మహేష్ దత్ ఎక్కా, గౌరవ్ ఉప్పల్, శ్రీమతి స్వాతి లక్రా, శ్రీమతి దేవసేన, శ్రీమతి దివ్య దేవరాజన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజల స్వరాన్ని సూచనగా స్వీకరించి, దానిని ఆచరణాత్మక సంస్కరణగా మార్చి, సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రజా కేంద్రిత పాలనను మరింత బలోపేతం చేయడమే “రిఫార్మ్ ఉత్సవ్” ప్రధాన ఉద్దేశ్యం.