తెలంగాణలో భారీగా ఆధునిక ధాన్య సైలోలు: మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • నిర్మాణం నుంచి నిర్వహణ వరకు మహిళా స్వయం సహాయక సంఘాలకు కీలక భాగస్వామ్యం
  • అదనంగా 5 నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల శాస్త్రీయ నిల్వ సామర్థ్యం లక్ష్యం
  • పెరుగుతున్న వరి ఉత్పత్తి, ధాన్యం సేకరణకు అనుగుణంగా శాశ్వత నిల్వ వ్యవస్థ
  • ఆటోమేటెడ్ హ్యాండ్లింగ్ నుంచి డిజిటల్ మానిటరింగ్ వరకు అత్యాధునిక సాంకేతికత
  • బియ్యం మిల్లర్ల నుంచి బకాయిల వసూలుకు పటిష్ట కార్యాచరణ
  • జీఈఎం, తెలంగాణ ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా పారదర్శకంగా ధాన్యం వేలం

హైదరాబాద్ : తెలంగాణలో ఏటేటా విస్తరిస్తున్న వరి సాగు, గణనీయంగా పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తి, ప్రభుత్వ సేకరణ అవసరాలకు దీర్ఘకాలిక పరిష్కారంగా అత్యాధునిక ధాన్య సైలోల నిర్మాణానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థను ఆదేశించారు. రాష్ట్రంలో అదనంగా 5 లక్షల నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల శాస్త్రీయ ధాన్య నిల్వ సామర్థ్యాన్ని సృష్టించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ సైలోల నిర్మాణం, నిర్వహణలో మహిళా స్వయం సహాయక సంఘాలను (SHGs) పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని మంత్రి సూచించారు. మహిళా సంఘాల ఆర్థిక సాధికారతకు కొత్త మార్గాలను తెరవడంతో పాటు, రాష్ట్ర ఆహార భద్రతకు అవసరమైన శాశ్వత మౌలిక సదుపాయాల నిర్మాణంలో వారిని భాగస్వాములను చేసే నమూనాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.

పౌర సరఫరాల సంస్థ కార్యకలాపాలపై సీనియర్ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తి, సేకరణకు అనుగుణంగా నిల్వ సామర్థ్యాన్ని విస్తరించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. మెరుగైన సాగునీటి సదుపాయాలు, సాగు విస్తీర్ణం పెరగడం, కనీస మద్దతు ధరకు ప్రభుత్వం ధాన్యం సేకరిస్తుండడంతో తెలంగాణలో వరి ఉత్పత్తితో పాటు ధాన్యం కొనుగోళ్లు కూడా ఏటేటా పెరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సేకరించిన ధాన్యాన్ని సురక్షితంగా, శాస్త్రీయంగా నిల్వ చేసేందుకు వ్యూహాత్మక ప్రాంతాల్లో ఆధునిక నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయడం అత్యవసరమైందన్నారు.

సంప్రదాయ గోదాములతోనే సరిపోదు
భవిష్యత్ అవసరాలను కేవలం సంప్రదాయ గోదాములతో తీర్చడం సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణకు ఆటోమేటెడ్ హ్యాండ్లింగ్, శాస్త్రీయ సంరక్షణ, యాంత్రిక రవాణా, డిజిటల్ పర్యవేక్షణ వంటి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలతో కూడిన నిల్వ నెట్‌వర్క్ అవసరమన్నారు. తేమ, పురుగులు, ఇతర నిల్వ సంబంధిత కారణాలతో ధాన్యం నష్టపోకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు. ధాన్యం నిల్వ నుంచి తరలింపు వరకు ప్రతి దశలో నాణ్యత, భద్రత, సామర్థ్యాన్ని పెంచే విధంగా సైలో వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలు, గ్రామస్థాయి సంస్థలు, పౌర సరఫరాల సంస్థ భాగస్వామ్యంతో ఆధునిక సైలోల నిర్మాణం, నిర్వహణ చేపట్టేందుకు అనువైన నమూనాలను అధ్యయనం చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందులో పౌర సరఫరాల సంస్థ, మహిళా సంఘాలు, ఇతర భాగస్వామ్య సంస్థల బాధ్యతలను స్పష్టంగా నిర్వచించాలని చెప్పారు. సైలోలు ఆర్థికంగా స్వయం సమర్థంగా, వృత్తిపరంగా నిర్వహించబడేలా తగిన ఆర్థిక, కార్యాచరణ నమూనాలను రూపొందించాలన్నారు.

“రాష్ట్ర ధాన్య నిల్వ మౌలిక సదుపాయాలను కేవలం వచ్చే కొనుగోలు సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని కాదు… రాబోయే దశాబ్దాల అవసరాలను ముందుగానే అంచనా వేసి నిర్మించాల్సిన ఆవశ్యకత ను ఆయన వివరించారు. ప్రస్తుతం తెలంగాణలో పౌర సరఫరాల సంస్థ, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, కేంద్ర గిడ్డంగుల సంస్థ, భారత ఆహార సంస్థ, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ప్రైవేటు పెట్టుబడిదారుల గోదాముల ద్వారా ధాన్యం నిల్వ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు సొంతంగా సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్నప్పటికీ, ప్రతి సీజన్‌లో భారీగా సేకరిస్తున్న ధాన్యాన్ని నిల్వ చేసేందుకు ఇతర సంస్థలు, అద్దె గోదాములపై ఆధారపడాల్సి వస్తోందన్నారు.

90 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు సిద్ధమైన వ్యవస్థ
ఇటీవలి ధాన్యం సేకరణ పరిమాణమే రాష్ట్ర నిల్వ వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడిని తెలియజేస్తోందని మంత్రి చెప్పారు. ఈ ఏడాది రబీ సీజన్‌లో పౌర సరఫరాల సంస్థ 90 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం సేకరించేందుకు సిద్ధమైందని, సీజన్ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా తక్షణమే సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. భారీ స్థాయిలో పెరుగుతున్న ధాన్యం సేకరణకు, అందుబాటులో ఉన్న శాశ్వత శాస్త్రీయ నిల్వ సామర్థ్యానికి మధ్య పెరుగుతున్న అంతరం కొత్త సైలోల నిర్మాణం ఎంత అత్యవసరమో స్పష్టం చేస్తోందన్నారు.

బియ్యం మిల్లర్ల బకాయిల వసూలుకు పటిష్ట వ్యూహం
డిఫాల్టర్ కస్టమ్ రైస్ మిల్లర్ల నుంచి రావాల్సిన బకాయిల వసూలును వేగవంతం చేసేందుకు సమర్థవంతమైన కార్యాచరణ రూపొందించాలని మంత్రి పౌర సరఫరాల సంస్థను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాలు, ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా బకాయిల వసూలు వ్యూహాన్ని సిద్ధం చేయాలని చెప్పారు. డిఫాల్టర్లపై చేపట్టే న్యాయపరమైన, విజిలెన్స్, పరిపాలనాపరమైన చర్యలన్నింటిలోనూ ప్రజాధనం తిరిగి రాబట్టడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.

ధాన్యం వేలంలో పూర్తి పారదర్శకత
ధాన్యం నిల్వల ప్రతిపాదిత వేలంపైనా మంత్రి సమీక్షించారు. తదుపరి విడత వేలం ప్రారంభించే ముందే లాట్ పరిమాణాలు, బిడ్డింగ్ నిబంధనలు, వేలం నిర్వహించే వేదికలను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. వేలం ప్రక్రియలో పారదర్శకత, ఏకరూపత, విస్తృత భాగస్వామ్యం ఉండేలా గవర్నమెంట్ ఈ-మార్కెట్‌ప్లేస్ (GeM), తెలంగాణ ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ వంటి గుర్తింపు పొందిన ప్రభుత్వ వేదికలను వినియోగించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలో పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తికి తగిన నిల్వ సామర్థ్యాన్ని సృష్టించడం ద్వారా రైతుల కష్టార్జిత పంటకు భద్రత కల్పించడంతో పాటు, ప్రజాధనాన్ని కాపాడటం, నిల్వ నష్టాలను తగ్గించడం, పౌర సరఫరాల వ్యవస్థను మరింత ఆధునికంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో పౌర సరఫరాల అదనపు సంచాలకులు రోహిత్ సింగ్, పౌర సరఫరాల సంస్థకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.