సూర్యాపేట టౌన్‌ ప్లానింగ్‌ అధికారి ఉయ్యాల సోమయ్య ఆస్తుల విలువ 3.54 కోట్లపైనే

  • సూర్యాపేట, హైదరాబాద్‌లో ఏసీబీ ఏకకాలంలో సోదాలు
  • ఆస్తుల పత్రాలు, బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు

 సూర్యాపేట మున్సిపాలిటీలోని టౌన్‌ ప్లానింగ్‌ అధికారిగా పనిచేస్తున్న ఉయ్యాల సోమయ్య ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణల నేపథ్యంలో గురువారం ఉదయం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సూర్యాపేటలోని మానసనగర్‌లోని సోమయ్య నివాసంలో అవినీతి నిరోధక శాఖ నల్లగొండ రేంజ్‌కు చెందిన ఏసీబీ అధికారులు టీపీవో నివాసం, కార్యాలయంతోపాటు ఆయన బంధువులు, సహచరులకు సంబంధించిన మరో ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో ఉదయం సోదాలు నిర్వహించి పలు ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను గుర్తించారు. వీటిలో సూర్యాపేట జిల్లాలో మూడెకరాల 3 గుంటల వ్యవసాయ భూమి, సూర్యాపేట, హయత్‌నగర్‌లో ఐదు నివాస ఆస్తులు, సూర్యాపేట పరిధిలో ఎనిమిది ఓపెన్‌ ప్లాట్లు ఉన్నట్టు గుర్తించారు.

బంగారం 709 గ్రాములు, వెండి 1,750 గ్రాములు, రూ.4,63,990 నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.13 లక్షల నిల్వలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. బంగారం, వెండి విలువ సుమారు రూ.20 లక్షలుగా అంచనా వేశారు. టీపీవోకు రెండు కార్లు, మూడు బైక్‌లు ఉన్నాయని, వీటి విలువ రూ. 25.20 లక్షలుగా అంచనా వేశారు. బంగారాన్ని తాకట్టు పెట్టి బ్యాంకు ద్వారా రూ. 49 లక్షల రుణం పొందినట్టు గుర్తించారు. మరిన్ని ఆస్తుల వివరాలపై విచారణ సాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ఆస్తుల విలువ రూ.3.54 కోట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు. అనంతరం సోమయ్యను హైదరాబాద్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించనున్నట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు.