డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డికి ఈడీ ఝలక్‌.. అక్రమాస్తులపై మనీలాండరింగ్‌ యాక్ట్‌

  • ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా కేసు నమోదు
  • లావాదేవీలపై ఆరా తీస్తున్న బృందం

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెన్షన్‌కు గురైన పోలీస్‌ కంప్యూటర్‌ సర్వీసెస్‌ డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. ఇబ్రహీంబాగ్‌లో ఓ విల్లాలో ఉంటున్న భీమ్‌రెడ్డిని జూలై 6న ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసి, చంచల్‌ గూడ జైలుకు పంపారు. ఏసీబీ విచారణ పూర్తి చేసుకొని ఆయన ఇటీవల బెయిల్‌పై బయటికి వచ్చారు. తెలంగాణ, కర్ణాటకలోని 16 ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో బహిరంగ మారెట్‌లో దాదాపు రూ.150 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు విలువ చేసే ఆస్తుల పత్రాలు లభ్యమయ్యాయి. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణలో ఉండగా, అక్రమ సొమ్ము బదిలీ లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దృష్టి సారించింది.

ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ కింద ఈడీ తాజాగా ఈసీఐఆర్‌ నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి, విచారణను వేగవంతం చేసింది. అక్రమమార్గాల్లో సంపాదించిన డబ్బును ఎకడెకడ మళ్లించారు? బినామీ ఖాతాల ద్వారా ఏ స్థిరాస్తులను కొనుగోలు చేశారనే కోణంలో నిధుల మూలాలను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈడీతో పాటు ఆదాయపు పన్నుశాఖకు చెందిన బినామీ ప్రొహిబిషన్‌ యూనిట్‌ కూడా భీమ్‌రెడ్డి ఆస్తులపై ఇప్పటికే కేసు నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు జరుపుతున్నది. ప్రాథమిక ఆధారాల సేకరణ పూర్తయిన వెంటనే భీమ్‌రెడ్డితో పాటు ఆయన బినామీలకు ఈడీ సమన్లు జారీ చేయనున్నట్టు తెలిసింది.