- రాష్ట్రాభివృద్ధికి ఊతమిచ్చే పలు మౌళిక వసతుల ప్రాజెక్టుల పట్ల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూల స్పందన
- తెలంగాణ అభివృద్ధికి కీలక ముందడుగు – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌కు ఆమోదం
- NH-65 హైదరాబాద్ – విజయవాడ – మచిలీపట్నం రహదారి విస్తరణ పనులు జనవరిలో ప్రారంభిస్తామని హామీ
- కృష్ణా నదిపై సోమశిల వద్ద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణ శంకుస్థాపనకు అంగీకారం
- తెలంగాణకు ఐదు రోప్‌వేలు, మూడు ఆర్ఓబీలకు ఆమోదం
- హైదరాబాద్–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌పై కొత్త డీపీఆర్‌కు ఆదేశాలు
- 34 రహదారి పనులకు CRIF నిధుల కోసం కేంద్ర అధికారులకు ఆదేశాలు
- హైదరాబాద్–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రతిపాదనపై సానుకూల స్పందన
- హైదరాబాద్ లో జరగనున్న IRC కి హాజరుకానున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: తెలంగాణలో రహదారి ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడం, ప్రజలకు ప్రయాణ సమయాన్ని తగ్గించడం, మెరుగైన రహదారులు, గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్రానికి అవసరమైన కీలక రహదారులు, వంతెనలు, ఎలివేటెడ్ కారిడార్లు, రోప్‌వేలు సహా పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో రహదారి కనెక్టివిటీని మెరుగుపరిచి, ప్రజల ప్రయాణ కష్టాలను తగ్గించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక, పర్యాటక అభివృద్ధికి దోహదపడే పలు ప్రతిపాదనలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించి, పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలపడంతో పాటు సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు.
ఎల్బీనగర్–హయత్‌నగర్ ఎలివేటెడ్ కారిడార్ కు ఆమోదం,2027 జనవరిలో NH-65 విస్తరణ ప్రారంభం
హైదరాబాద్‌లో వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాల్లో ఒకటైన ఎల్బీనగర్–హయత్‌నగర్ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. ఈ మార్గంతో పాటు పరిసర ప్రాంతాల్లోని సుమారు 54 కాలనీల్లో 10 లక్షల మందికి పైగా నివసిస్తున్నారని,ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు నిత్యం ప్రయాణించే ఈ మార్గంలో ట్రాఫిక్ తో పాటు, యాక్సిడెంట్ ఎక్కువగా జరుగుతున్నాయని మంత్రి కోమటి రెడ్డి, నితిన్ గడ్కరికి వివరించారు. ఈ మార్గంలో ప్రమాదాలు, ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని తెలుపగా, కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి వార్షిక ప్లాన్ లో చేర్చి,ఎలివేటెడ్ కారిడార్ కు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే వేలాది మంది ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గడంతో పాటు ప్రయాణ సమయం ఆదా కానుంది. హైదరాబాద్ – విజయవాడ NH – 65 రహదారి పై నిత్యం జరుగుతున్న ప్రమాదాలపై పలు సందర్బాల్లో కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లిన అంశాలను గుర్తు చేశారు. 17 బ్లాక్ స్పాట్స్ గుర్తించి ఫ్లై ఓవర్లు నిర్మాణం జరుగుతున్నా… ప్రస్తుతం ఉన్న 4 లేన్ రహదారిపై ట్రాఫిక్ లోడ్ విపరీతంగా పెరిగిందని, హైదరాబాద్–విజయవాడ–మచిలీపట్నం NH-65 6+2 లేన్ల విస్తరణ పనులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించి త్వరగా చేపట్టాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా, వాణిజ్య కార్యకలాపాలకు కీలకమైన హైదరాబాద్–విజయవాడ–మచిలీపట్నం NH-65 విస్తరణ పనులకు నవంబర్ లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి 2027 జనవరిలో పనులు ప్రారంభిస్తామని కేంద్రమంత్రి హామి ఇచ్చారు. పెరుగుతున్న వాహన రద్దీకి అనుగుణంగా రహదారి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడనుంది.
సోమశిల వద్ద కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం..ప్రయాణ దూరం,సమయం తగ్గుదల.. పర్యాటకానికి ఊతం
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రోడ్డు అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేలా NH-167Kపై కృష్ణా నదికి ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కోసం మంత్రి చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రి అంగీకారం తెలిపారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతంలో సోమశిల నుంచి సంగమేశ్వర వరకు నిర్మించే ఈ బ్రిడ్జి ద్వారా తిరుపతి వెళ్లే వారికి సుమారు 80కి.మీ దూరం తగ్గి, దాదాపుగా 3 గంటల ప్రయాణ సమయం తగ్గుతుందని మంత్రి వివరించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సోమశిల ఆలయం వద్ద పర్యాటక రంగం అభివృద్ధి చెంది తెలంగాణలో ఒక మైలురాయిగా నిలవనుందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి మంత్రి కోమటి రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. పర్యాటకం అభివృద్ధి చెందడంతో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడనున్నాయనీ,ఆర్ధిక కార్యకలాపాలకు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయనీ తెలిపారు.
శ్రీశైలం మార్గంలో ఎలివేటెడ్ కారిడార్‌కు కొత్త డీపీఆర్
హైదరాబాద్–శ్రీశైలం NH-765పై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన విజ్ఞప్తిపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొత్త DPR సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
పర్యాటక రంగానికి రోప్‌వేలతో కొత్త ఊతం
తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి, ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు సులభంగా చేరుకునేందుకు పర్వతమాల పథకం కింద ఐదు రోప్‌వేల ఏర్పాటుకు కేంద్ర మంత్రి ఆమోదం తెలిపారు. దీనివల్ల పర్యాటకులకు ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ఆయా ప్రాంతాల్లో స్థానిక ఉపాధి, ఆర్థిక కార్యకలాపాలకు ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది.
హైదరాబాద్–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రతిపాదనపైనా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ ప్రాజెక్టు ముందుకు సాగితే రెండు రాష్ట్రల మధ్య రవాణా మరింత మెరుగుపడనుంది.
రైల్వే క్రాసింగ్‌ల వద్ద ఇబ్బందులకు పరిష్కారం
సేతు బంధన్ పథకం కింద తెలంగాణలో మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జిల (ROB) నిర్మాణానికి కేంద్ర మంత్రి ఆమోదం తెలిపారు. రైల్వే గేట్ల వద్ద వాహనదారులు ఎదుర్కొనే నిరీక్షణను తగ్గించి, రహదారి భద్రతను మెరుగుపరచడానికి ఈ వంతెనలు దోహదపడనున్నాయి.
రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలని, 34 రహదారి పనులకు CRIF నిధుల కొరకు విజ్ఞప్తి
రాష్ట్రంలో 34 రహదారి పనులకు సీఆర్ఐఎఫ్ (CRIF) నుంచి నిధులు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన నితిన్ గడ్కరీ సంబంధిత కేంద్ర అధికారులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదేవిధంగా పుల్లూరు–అలంపూర్–జట్రపోలు–పెంట్లవెల్లి–కొల్లాపూర్–లింగాల–అచ్చంపేట–డిండి–దేవరకొండ–మల్లేపల్లి–నల్గొండ రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలన్న ప్రతిపాదనను మంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రతిపాదనపై కూడా నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు.
హైదరాబాద్‌లో IRC సమావేశాలకు గడ్కరీని ఆహ్వానించిన మంత్రి
నవంబర్ 19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో జరగనున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (IRC) కార్యక్రమానికి హాజరుకావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఆహ్వానించారు. ఈ ఆహ్వానంపై సానుకూలంగా స్పందించిన గడ్కరీ, కార్యక్రమానికి హాజరవుతానని తెలిపారు.
ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలే లక్ష్యం
రహదారులు కేవలం ప్రయాణ సాధనాలు మాత్రమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే అభివృద్ధి మార్గాలని రాష్ట్ర ప్రభుత్వం నమ్ముతుందని మంత్రి కోమటి రెడ్డి పేర్కొన్నారు. ఈ లక్ష్యంతోనే తెలంగాణకు అవసరమైన కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్రం సహకారం పొందేందుకు ముఖ్యమంత్రి నాయకత్వంలో నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర రహదారి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందించేందుకు కీలకంగా నిలవనుందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, MoRTH అధికారులు,రాష్ట్ర అధికారులు ఉన్నారు.