- తెలంగాణ ఆత్మను ప్రతిబింబిచేలా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా బతుకమ్మ వేడుకల నిర్వహణ
- సంప్రదాయ వస్త్రధారణలో బతుకమ్మ ఉత్సవాల్లో ఉత్సాహవంతంగా పాల్గొన్న మహిళా ఉద్యోగులు
- తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి-సంప్రదాయాలు, సామూహిక జీవన విధానానికి ప్రతీకగా బతుకమ్మ వేడుకల నిర్వహణ
- మహిళా ఉద్యోగుల బతుకమ్మ ఆటపాటలతో పండుగ శోభను సంతరించుకున్న సనత్ నగర్ టిజిపిసిబి ప్రధాన కార్యాలయం
- సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణ బాధ్యతను భావితరాలకు అందించాలనే బతుకమ్మ పండుగ స్ఫూర్తిని చాటి చెప్పిన టిజిపిసిబి ఉద్యోగులు
తెలంగాణ నేల వైభవానికి, ప్రజల సాంస్కృతిక చైతన్యానికి, తరతరాలుగా కొనసాగుతున్న పూల పండుగ సంప్రదాయానికి, ప్రకృతితో మమేకమైన జీవన తత్వానికి ప్రతిరూపమైన బతుకమ్మ పండుగను సనత్ నగర్ లోని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయంలో ‘తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దేవీ శరన్నవరాత్రుల ఆధ్యాత్మిక శోభను మరింత ఇనుమడింపజేస్తూ, ప్రకృతి ఆరాధనకు, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా సంప్రదాయబద్ధంగా నిర్వహించిన బతుకమ్మ ఉత్సవంలో మహిళా ఉద్యోగులు ఉత్సాహభరితంగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ, పూల పరిమళాలు, మహిళా ఉద్యోగుల బతుకమ్మ ఆటపాటలతో కార్యాలయ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకున్నది. ఉదయం మహిళా ఉద్యోగులంతా దుర్గాదేవికి భక్తిశ్రద్ధలతో నిర్వహించిన కుంకుమ పూజలో పాల్గొని ఆ తర్వాత బతుకమ్మ ఉత్సవంలో పాల్గొన్నారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర సహజసిద్ధమైన పూలతో అందంగా బతుకమ్మలను అలంకరించి, మధ్యలో గౌరమ్మను ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత బతుకమ్మల చుట్టూ చేరి, బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటమాడుతూ ఉత్సాహంగా సంబురాలు జరుపుకున్నారు. సంప్రదాయ ఆటపాటలు, బతుకమ్మ పాటలతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్న తర్వాత బతుకమ్మలను సంప్రదాయబద్ధంగా నీటి తొట్టెల్లో నిమజ్జనం చేశారు. అమ్మవారికి నివేదించిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి, పరస్పరం పంచుకుంటూ బతుకమ్మ వేడుకలను ఆనందభరిత వాతావరణంలో ముగించారు.
ఈ సందర్భంగా సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ శకుంతల మాట్లాడుతూ, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఈ సంవత్సరం కూడా బతుకమ్మ పండుగను ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఉద్యోగులుగా ప్రతి పండుగను పర్యావరణహితంగా జరుపుకోవడంతో పాటు, ప్రజలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సహజసిద్ధంగా ప్రకృతిలో లభించే పూలు, ఆకులతో బతుకమ్మలను పేర్చి సంబరాలను జరుపుకుంటున్నట్లు తెలిపారు.
బతుకమ్మ పుట్టుకకు సంబంధించి ఎన్నో జానపద కథలు, విశ్వాసాలు ప్రచారంలో ఉన్నప్పటికీ, ‘బతుకు – బతుకనివ్వు’ అనే జీవన సూత్రమే బతుకమ్మ పండుగ అందించే గొప్ప సందేశమని పేర్కొన్నారు. మనకు జీవితాన్ని ప్రసాదించిన ప్రకృతిని కాపాడుకుంటూ, ప్రకృతే మన మనుగడకు ఆధారమని, ప్రకృతి పరిరక్షణే భావితరాల భవిష్యత్తుకు భరోసా అని గుర్తించాలని సూచించారు. మట్టి గణపతుల పంపిణీ, పర్యావరణహితంగా బతుకమ్మ పండుగ నిర్వహణ, గ్రీన్ దీపావళి థీమ్ ద్వారా పర్యావరణ పరిరక్షణకు కాలుష్య నియంత్రణ మండలి ప్రతి ఏటా ప్రభావవంతమైన కార్యక్రమాలను చేపడుతున్నదని అన్నారు. పూలతో బతుకమ్మను పేర్చి ప్రకృతిని ఆరాధించే మనం, అదే స్ఫూర్తితో జలవనరులను కలుషితం కాకుండా కాపాడుకోవడం, పర్యావరణానికి హాని కలిగించని విధంగా పండుగలను జరుపుకోవడం అలవర్చుకోవాలనీ ప్రజలకు పిలుపునిచ్చారు.
‘తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఎంప్లాయిస్ అసోసియేషన్’ కల్చరల్ సెక్రటరీ, అడ్మనిస్ట్రేటివ్ ఆఫీసర్ అరుణ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగను కూడా సహజసిద్ధమైన పూలతో, ప్లాస్టిక్ అలంకరణలకు దూరంగా పర్యావరణహితంగా జరుపుకోవాలని సూచించారు. బతుకమ్మ ఆటల తర్వాత సంప్రదాయం ప్రకారం జలాశయాల్లో నిమజ్జనం చేసే సమయంలో ప్లాస్టిక్ కవర్లు, అనవసర అలంకరణలు, ఇతర వ్యర్థాలు నీటిలో కలవకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. మన సంప్రదాయాలను కాపాడుకుంటూ, ప్రకృతిని పరిరక్షిస్తూ, పర్యావరణహిత పండుగలను భావితరాలకు అందిద్దామని తన సందేశాన్నిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పలువురు బాధ్యులు, టిజిపిసిబి కార్యాలయ ఇంజనీరింగ్, సైంటిఫిక్, అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్ తదితర విభాగాలకు సంబంధించిన పలువురు సిబ్బంది పాల్గొన్నారు.