నేల తల్లిని సంరక్షించుకుంటేనే భవిష్యత్ తరాలకు ఆహార భద్రత: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • ఖేత్ బచావో అభియాన్‌తో భూసార పరిరక్షణ, సుస్థిర వ్యవసాయానికి శ్రీకారం
  • రసాయన ఎరువులు, పురుగుమందులను శాస్త్రీయ పద్ధతుల్లోనే వినియోగించాలి
  • వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు పంటల సాగులో మార్పులు చేసుకోవాలి
  • సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాలి
  • పంట వ్యర్థాలను కాల్చకుండా మల్చింగ్‌కు వినియోగించాలి.. నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి

నేల తల్లిని సంరక్షించుకుంటేనే భవిష్యత్ తరాలకు ఆహార భద్రత కల్పించగలమని, భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా వ్యవసాయంలో ఆశించిన దిగుబడులు సాధించడం సాధ్యం కాదని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నేల సారాన్ని పరిరక్షించడం, పంట భూములను సంరక్షించడం, ప్రకృతి వనరులను సమర్థవంతంగా వినియోగించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు. రైతుల సంక్షేమంతో పాటు భవిష్యత్ వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకొని భూసార పరిరక్షణకు ప్రాధాన్యతనివ్వాలని స్పష్టం చేశారు. గురువారం నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఖేత్ బచావో అభియాన్’ (సాగు భూమి సంరక్షణ) కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ భూముల పరిరక్షణ, భూసార పరీక్షలు, నీటి పొదుపు, వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల ఎంపిక, సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, పంట వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై రైతులకు కీలక సూచనలు చేశారు. భవిష్యత్ తరాలకు సారవంతమైన భూములను అందించాలంటే వ్యవసాయ పద్ధతుల్లో శాస్త్రీయ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందని, ఋతుపవనాల తగ్గుదల, భూతాపం పెరుగుదల, వర్షపాతం అసమానతలు, వర్షాలు సకాలంలో కురవకపోవడం వంటి పరిస్థితులు వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వివరించారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటల సాగులో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూమి స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. రైతులు రసాయన ఎరువులు, పురుగుమందులను అవసరానికి మించి వినియోగించకుండా వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన మోతాదుల్లోనే ఉపయోగించాలని మంత్రి స్పష్టం చేశారు. అధిక మోతాదుల్లో రసాయనాల వినియోగం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలు పడే ప్రమాదం ఉందని తెలిపారు. పంటల్లో రసాయనాల అవశేషాలు పెరిగితే ఆహార నాణ్యత, భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందువల్ల రైతులు శాస్త్రీయ సాగు పద్ధతులను పాటిస్తూ, సమగ్ర పోషక యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ విధానాలను అనుసరించాలని సూచించారు.

ప్రతి రైతు తప్పనిసరిగా తన వ్యవసాయ భూమికి భూసార పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కోరారు. నేలలో ఉన్న పోషకాల స్థాయిని తెలుసుకొని, ఏ పంటకు ఎలాంటి ఎరువులు ఎంత మోతాదులో అవసరమో నిర్ధారించుకున్న తర్వాతే వాటిని వినియోగించాలని సూచించారు. దీనివల్ల అనవసరమైన ఎరువుల ఖర్చును తగ్గించుకోవడంతో పాటు నేల సారాన్ని కాపాడుకోవచ్చని వివరించారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి గ్రామం, ప్రతి రైతు భూమికి సంబంధించిన భూసార పరీక్షల వివరాలను క్రమబద్ధంగా నమోదు చేసి, రికార్డులను నిర్వహించాలని ఆదేశించారు. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా రైతులకు అవసరమైన సలహాలు అందించాలని, నేల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే విధానాన్ని బలోపేతం చేయాలని సూచించారు. రైతులను సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించడంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు కీలక పాత్ర పోషించాలని మంత్రి పేర్కొన్నారు. సేంద్రీయ పద్ధతులు, జీవ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, పంట మార్పిడి వంటి విధానాల ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కేవలం సూచనలు ఇవ్వడమే కాకుండా క్షేత్రస్థాయిలో రైతులకు ఉపయోగపడే ప్రదర్శనలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. రైతులకు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసి, తక్కువ పెట్టుబడితో స్థిరమైన దిగుబడులు సాధించేలా మార్గనిర్దేశం చేయాలని అధికారులకు సూచించారు. భూగర్భ జలాలు రోజురోజుకూ తగ్గిపోతున్న నేపథ్యంలో నీటి వినియోగంలో రైతులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి అన్నారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ, తక్కువ నీటితో పండే పంటలకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. డ్రిప్ ఇరిగేషన్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను విస్తృతంగా ప్రోత్సహించాలని, నీటి ప్రతి చుక్కను సమర్థవంతంగా వినియోగించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. సాగునీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో భూమి రకం, నీటి వసతి, స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి రెండు మూడు తడులతో పండే స్వల్పకాలిక పంటలు, అపరాల పంటలను సాగు చేసుకునేలా రైతులకు సలహాలు ఇవ్వాలని సూచించారు.

రైతులకు మెరుగైన ఆదాయం కల్పించడంతో పాటు నీటి వినియోగాన్ని తగ్గించే దిశగా పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు. సంప్రదాయ పంటలతో పాటు ప్రాంతానికి అనుకూలమైన ఉద్యాన పంటలను సాగు చేసే అవకాశాలను రైతులకు వివరించాలని సూచించారు. రైతులు పెట్టుబడి వ్యయం తగ్గించడం, నీటిని ఆదా చేయడం, పంటకు మార్కెట్‌లో లభించే ధర, నికర ఆదాయం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయం చేయాలని సూచించారు. వర్షపు నీటిని వృథా కాకుండా ఒడిసిపట్టుకోవడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకునే చర్యలు చేపట్టాలని మంత్రి తెలిపారు. వ్యవసాయ క్షేత్రాల్లో ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేసుకొని వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలని, పొలాల్లోకి నీరు ఇంకేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, నేల కోత నివారణ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వాగుల్లో ఇసుకను అధికంగా తీయడం వల్ల నీటి నిల్వలు, భూగర్భ జలాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంటూ, సహజ నీటి వనరులను సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. పంట కోతల అనంతరం మిగిలే వ్యర్థాలను కాల్చివేయడం వల్ల నేలలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులకు నష్టం కలగడంతో పాటు గాలి కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందని మంత్రి తెలిపారు. పంట వ్యర్థాలను కాల్చకుండా వాటిని మల్చింగ్‌కు వినియోగించాలని, నేలలో తేమ నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పంట వ్యర్థాలను సక్రమంగా వినియోగించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడవచ్చని పేర్కొన్నారు. వ్యవసాయంతో పాటు పశుపోషణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, పశువులకు అవసరమైన పశుగ్రాసం పెంపకాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. పంట అవశేషాలను పశుగ్రాసంగా ఉపయోగించుకునే అవకాశాలను కూడా రైతులు పరిశీలించాలని సూచించారు.

వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, యాంత్రీకరణను విస్తృతంగా వినియోగించడం ద్వారా రైతుల శ్రమ, పెట్టుబడి వ్యయాన్ని తగ్గించవచ్చని మంత్రి అన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద అర్హులైన రైతులతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు (ఎఫ్‌పీఓలు) కూడా వ్యవసాయ పనిముట్లు అందిస్తామని తెలిపారు. ఆధునిక వ్యవసాయ యంత్రాల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించి, అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునేలా అధికారులు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. చిన్న, సన్నకారు రైతులకు సమూహాల ద్వారా వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి తీసుకురావడం వల్ల సాగు పనులు సకాలంలో పూర్తి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఖేత్ బచావో అభియాన్‌ను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా, వ్యవసాయ భూముల పరిరక్షణకు నిరంతరం కొనసాగాల్సిన ఉద్యమంగా తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. జిల్లా వ్యవసాయ అధికారులు మండలాల వారీగా కార్యాచరణ రూపొందించి, గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులకు ఎప్పటికప్పుడు శాస్త్రీయ సాంకేతిక సలహాలు అందిస్తూ, వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు పద్ధతులను అవలంబించేలా ప్రోత్సహించాలని తెలిపారు. నేల ఆరోగ్యం, నీటి సంరక్షణ, పంటల వైవిధ్యీకరణ, సేంద్రీయ వ్యవసాయం, పంట వ్యర్థాల సమర్థ వినియోగం వంటి అంశాలపై రైతుల్లో అవగాహన పెంపొందించడం ద్వారా వ్యవసాయాన్ని మరింత స్థిరమైన, లాభదాయకమైన రంగంగా తీర్చిదిద్దవచ్చని మంత్రి పేర్కొన్నారు. రైతులు ప్రకృతి వనరులను కాపాడుకుంటూ, శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తూ తెలివిగా వ్యవసాయం చేయాలని సూచించారు. వ్యవసాయ భూములను సంరక్షించడం, నేల సారాన్ని పెంపొందించడం, నీటి వనరులను కాపాడుకోవడం వంటి లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఖేత్ బచావో అభియాన్‌ను విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.