పత్తి కొనుగోళ్లకు సర్వం సిద్ధం.. అని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం

  • పత్తి రైతుకు ధరల భరోసా కల్పించాలి.. అధికారులకు తుమ్మల దిశానిర్దేశం
  • పత్తి మార్కెట్లలో ధరల వ్యత్యాసంపై సమీక్ష.. స్పిన్నింగ్, ప్రాసెసింగ్ పరిశ్రమల విస్తరణకు చర్యలు చేపట్టాలి

హైదరాబాద్ : రాష్ట్రంలో 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి పత్తి కొనుగోలు కేంద్రాలను గత ఏడాది మాదిరిగానే ప్రారంభించి, రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార మరియు చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో మార్కెటింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్రంలో పత్తి సాగు, ఉత్పత్తి అంచనాలు, మార్కెట్ ధరలు, సీసీఐ కొనుగోళ్లకు చేసిన ఏర్పాట్లు, రైతులకు అందిస్తున్న సౌకర్యాలపై సమీక్షించారు. పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడటం, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ ప్రాధాన్యత అని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుత 2026-27 ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 48.20 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరగగా, 29.43 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. గత సీజన్‌లో 50.73 లక్షల ఎకరాల్లో సాగు జరగగా, 28.33 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నమోదైంది. దేశవ్యాప్తంగా ప్రస్తుత సీజన్‌లో 271.06 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరగగా, 133.04 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా. గత సీజన్‌లో 148.02 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నమోదైంది. దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం సహా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పత్తి ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో, రాష్ట్రంలో కొనుగోళ్ల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని మంత్రి సూచించారు.

కనీస మద్దతు ధర రూ.8,667.. రైతులకు ధరల భరోసా
కేంద్ర ప్రభుత్వం 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు పత్తి కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.8,667గా ప్రకటించింది. ప్రస్తుతం తెలంగాణలో పత్తి మోడల్ మార్కెట్ ధర సుమారు రూ.9,000గా ఉందని అధికారులు వివరించారు. ఇది కనీస మద్దతు ధర కంటే రూ.333 అధికం. మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కంటే ఎక్కువగా ఉన్నప్పుడు రైతులు బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవచ్చని, ధరలు తగ్గి కనీస మద్దతు ధర కంటే దిగువకు వచ్చినప్పుడు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని విక్రయించుకునే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు సీసీఐ, మార్కెటింగ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పత్తిలో తేమ శాతం, నాణ్యత ఆధారంగా సీసీఐ నిబంధనల ప్రకారం కొనుగోలు ధర నిర్ణయిస్తారని, రైతులు పత్తిని విక్రయించే ముందు నాణ్యత ప్రమాణాలు, తేమ శాతాన్ని పరిశీలించుకోవాలని సూచించారు.

335 జిన్నింగ్ మిల్లులు కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై
2026-27 సీజన్‌లో పత్తి కొనుగోళ్ల కోసం సీసీఐ గత సీజన్‌లో ఉన్న 122 కొనుగోలు కేంద్రాల సంఖ్యను 133కు పెంచింది. రాష్ట్రంలో రోజుకు 1,09,035 బేళ్ల సామర్థ్యంతో 356 జిన్నింగ్ మిల్లులు ఉండగా, ఇప్పటివరకు 30 జిల్లాల్లో 335 జిన్నింగ్ మిల్లులను కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేసినట్లు అధికారులు తెలిపారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి 11-08-2026న రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించి, సీసీఐ, సంబంధిత శాఖల అధికారులు, జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులకు అవసరమైన సూచనలు ఇచ్చినట్లు వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, పత్తి నాణ్యత పరీక్షలు, జిన్నింగ్, బేళ్ల తయారీ, గోదాములకు రవాణా, రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం జారీ చేసిన G.O.Rt.No.640, తేదీ 01-10-2026 ద్వారా రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీని, G.O.Rt.No.641, తేదీ 01-10-2026 ద్వారా జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీలు పత్తి మార్కెట్ ధరలు, కొనుగోళ్ల పురోగతి, కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.

దేశంలోని ఇతర ప్రధాన పత్తి మార్కెట్లతో పోలిస్తే తెలంగాణలో కొన్ని మార్కెట్లలో ధరలు తక్కువగా ఉండటానికి గల కారణాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పత్తి గింజల ప్రాసెసింగ్ యూనిట్లు, స్పిన్నింగ్ పరిశ్రమల సంఖ్య, సామర్థ్యం తక్కువగా ఉండటం కూడా ధరలపై ప్రభావం చూపుతోందని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పత్తి ప్రాసెసింగ్, స్పిన్నింగ్, ఆయిల్ పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన అవకాశాలను పరిశీలించాలని మంత్రి సూచించారు. ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలు, సౌకర్యాల వివరాలను సేకరించి, తెలంగాణలో పత్తి ఆధారిత పరిశ్రమల విస్తరణకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ, సీసీఐ అధికారులు బహిరంగ మార్కెట్లో పత్తి ధరలను ప్రతిరోజూ సమీక్షిస్తూ, ధరల వ్యత్యాసాలకు గల కారణాలను విశ్లేషించాలని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పత్తి ప్రాసెసింగ్ సామర్థ్యం పెరిగితే స్థానికంగా పత్తికి డిమాండ్ పెరిగి, రైతులకు మెరుగైన ధరలు లభించే అవకాశాలు ఉంటాయని తెలిపారు.

నాణ్యమైన పత్తి సేకరణపై ప్రత్యేక దృష్టి
పత్తి కొనుగోళ్లలో తెలంగాణ దేశంలో ముందంజలో ఉండటానికి రాష్ట్రంలో పండించే నాణ్యమైన పత్తి ప్రధాన కారణమని మంత్రి పేర్కొన్నారు.రైతులు పండించిన పత్తిని సేకరించి మార్కెట్లకు తరలించే సమయంలో నాణ్యత దెబ్బతినకుండా రైతులకు అవగాహన కల్పించాలని, కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలను కాపాడటం ద్వారా రైతులకు మెరుగైన ధర లభించడంతో పాటు సీసీఐ కొనుగోళ్లు కూడా సజావుగా సాగుతాయని తెలిపారు.

కపాస్ కిసాన్ యాప్‌తో రైతులకు సౌలభ్యం
పత్తి కొనుగోళ్లలో పారదర్శకత పెంచేందుకు కపాస్ కిసాన్ యాప్, ఆన్‌లైన్ చెల్లింపులు, రైతుల వివరాల ధ్రువీకరణ వంటి డిజిటల్ విధానాలను అమలు చేస్తున్నారు. అక్టోబర్ 21, 2026 నాటికి 12,75,185 మంది రైతులకు సంబంధించిన 21,58,938 వివరాలను కపాస్ కిసాన్ యాప్‌తో అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు. రైతులు పత్తి విక్రయానికి స్లాట్ బుక్ చేసుకునే ముందు యాప్‌లో నమోదైన వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. జిల్లాకు నిర్ణయించిన సగటు దిగుబడి కంటే ఎక్కువ పత్తి దిగుబడి ఉన్న రైతులు అదనపు దిగుబడి ధ్రువీకరణ కోసం సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి (AEO)ను సంప్రదించాలి. కౌలు రైతులు తమ పేర్ల నమోదు కోసం సంబంధిత AEOను సంప్రదించి, అవసరమైన భూమి, ఆధార్, మొబైల్ వివరాలను అందించాలని అధికారులు సూచించారు. భూ యజమాని ధ్రువీకరణ అనంతరం నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.

టోల్‌ఫ్రీ, వాట్సాప్ సేవలు అందుబాటులోకి
పత్తి రైతులకు సమాచారం, సహాయం అందించేందుకు మార్కెటింగ్ శాఖ 1800-599-5779 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే 8897281111 వాట్సాప్ నంబర్ ద్వారా పత్తి కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను తెలుసుకునే సౌకర్యం కల్పించింది. ఈ సేవల ద్వారా రైతులు సీసీఐ ద్వారా ఎంత పత్తి విక్రయించవచ్చో, విక్రయించిన పంట విలువ, చెల్లింపుల స్థితి, కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉండే సమయం తదితర వివరాలను తెలుసుకోవచ్చు. అన్ని మార్కెట్ యార్డుల్లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి, కొనుగోలు కేంద్రాల్లో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. రైతులు పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ముందు తేమ శాతాన్ని పరీక్షించుకునేందుకు రాష్ట్రంలోని రైతు వేదికల వద్ద మాయిశ్చర్ మీటర్లను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

రైతులకు మంత్రి విజ్ఞప్తి
రైతులు ప్రస్తుత మార్కెట్ ధరలను పరిశీలించి, కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధర లభిస్తున్నప్పుడు బహిరంగ మార్కెట్లో పత్తిని విక్రయించుకోవాలని మంత్రి సూచించారు. మార్కెట్ ధర తగ్గినప్పుడు సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలకు అనుగుణంగా పత్తిని విక్రయించుకోవాలని కోరారు. పత్తి కొనుగోళ్లలో పారదర్శకత, రైతులకు ధరల భరోసా, సకాలంలో చెల్లింపులు, కొనుగోలు కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.