
దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 909 కరోనా కేసులు నమోదయ్యాయని, 34 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ అధికారులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. ‘భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,356కు చేరింది. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 273 మంది మరణించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా నియంత్రణలో ఉంది. కరోనా వచ్చిన వారిని, కలిసిన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. కరోనా పరీక్షల సామర్థ్యాన్ని క్రమంగా పెంచుకుంటూ పోతున్నాం. ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ కరోనా పరీక్షలకు అనుమతి ఇస్తున్నాం. ఇప్పటి వరకు 1.80 లక్షల శాంపిల్స్ టెస్టు చేశాం. 151 ప్రభుత్వ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు చేస్తున్నాం. ప్రైవేటు ఆస్పత్రుల సేవలు కూడా ఉపయోగించుకుంటున్నాం. ఆస్పత్రులు, ఐసోలేషన్ కేంద్రాల సంఖ్యను పెంచుకుంటున్నాం. పెరుగుతున్న కరోనా కేసులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని’ కేంద్రం పేర్కొంది.