కామినేని కాలేజీకి రూ.10 లక్షలు జరిమానా విధించిన సుప్రీంకోర్టు

హైదరాబాద్‌లోని కామినేని అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌(కేఏఎంఎస్‌ఆర్‌సీ)కు సుప్రీంకోర్టు రూ.10 లక్షలు జరిమానా విధించింది. ఓ విద్యార్థిని అడ్మిషన్‌ను తిరస్కరించి అకడమిక్‌ సంవత్సరం కోల్పోయేలా చేసినందుకు రూ.10 లక్షలు ఆమెకు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వర్‌రావు, జస్టిస్‌ హేమంత్‌గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ తీర్పు వెలువరించింది. మోతుకూరు శ్రీయకౌముది నీట్‌ ర్యాంకు ప్రకారం కామినేనిలో పీజీసీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమెకు ప్రొవిజనల్‌ అడ్మిషన్‌ మంజూరుచేసిన కళాశాల, గడువులోగా ఆమె కళాశాలకు వచ్చినప్పటికీ పూర్తిస్థాయి అడ్మిషన్‌ ఇవ్వలేదు. ఆమె కంటే తక్కువ ర్యాంకు వచ్చిన మరొకరికి సీటు కేటాయించింది. దీనిపై శ్రీయ హైకోర్టును ఆశ్రయించగా.. అదనంగా సీటు మంజూరుచేయాలని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌కు ఆదేశాలు జారీచేసింది. గడువు పూర్తయిన తర్వాత అదనంగా సీటు ఇవ్వడం సాధ్యంకాదని మెడికల్‌ కమిషన్‌ సుప్రీంకోర్టులో అప్పీల్‌ దాఖలుచేసింది. అడ్మిషన్‌ ప్రక్రియను పూర్తిచేయనందుకు వైద్యకళాశాలను తప్పుపట్టిన సుప్రీంకోర్టు, విద్యార్థినికి పరిహారం చెల్లించాలని ఆదేశించింది.