తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయాన్ని జాతీయ వేద విశ్వవిద్యాలయంగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి…కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ ను కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఢిల్లీలో మంత్రిని కలసి వినతిపత్రం అందజేశారు.
2006 లో టీటీడీ నేతృత్వంలో వేద విద్య వ్యాప్తి, పరిరక్షణ కోసం శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయంగా ప్రారంభించామన్నారు. 2007లో యూజీసీ దీన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయంగా గుర్తించిందని చైర్మన్ వివరించారు. ఈ వర్శిటీ వేదాల్లో డిగ్రీ నుంచి పిహెచ్డీ దాకా అనేక కోర్సులు నడుపుతోందన్నారు. 14ఏండ్లుగా టీటీడీ నిర్వహిస్తున్న వేద విశ్వవిద్యాలయానికి యూజీసీ 2ఎఫ్ గుర్తింపు ఇచ్చిందనీ, ఇప్పుడు 12బి కేటగిరీ గుర్తింపు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.