- క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా కమిషనర్
హైడ్రా రెండో విడత చేపడుతున్న 14 చెరువుల పునరుద్ధరణ పనులను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. మంగళవారం ఉప్పల్ మండలంలోని నాచారంలోని పెద్ద చెరువును పరిశీలించారు. మొత్తం 108.30 ఎకరాలున్న నాచారం చెరువులో 81.12 ఎకరాలమేర నీటి జాడ కనిపించకుండా కమ్మేసిన గుర్రపు డెక్కను గమనించారు. వెంటనే చెరువులోని మురికి నీటిని కిందకు వదిలేసి పూడికను పూర్తిగా తొలగించాలని ఆ చెరువు పనులు పర్యవేక్షిస్తున్న అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు. స్థానికులు పెద్దయెత్తున హైడ్రా కమిషనర్నుకలిసి నాచారం చెరువు పునరుద్ధరణ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. మురుగునీరు కలవడంతో చెరువంతా గుర్రపుడెక్క వ్యాపించి దోమలతో చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటలా, పాతబస్తీలోని బమృక్నుద్దౌలా, కూకట్పల్లి నల్లచెరువు మాదరి అభివృద్ధి చేసి ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఇక్కడ గతంలో ఎస్టీపీ పెట్టినా ప్రయోజనం లేకపోయిందని.. నేరుగా మురుగు నీరు కలిసిపోతోందని హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ చెరువు నీరు వదిలితే నేరుగా ఉప్పల్ నల్లచెరువులోకలుస్తున్నదని.. దీంతో ఆ చెరువు అభివృద్ధి పనులు ఆలస్యమయ్యే ప్రమాదముందని అధికారులు ఈ సందర్భంగా కమిషనర్‌కు తెలిపారు. ఉప్పల్ నల్లచెరువు వద్ద కాలువను డైవర్ట్ చేసి వెంటనే ఈ చెరువు అభివృద్ధి పనలు మొదలు పెట్టాలని కోరారు. నాచారం చెరువు పునరుద్ధరణ చేపట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. చెరువుల అభివృద్ధిలో తనదైన ప్రత్యేకత చాటుతున్న హైడ్రా ఈ చెరువు పునరుద్ధరణ పనులు చేపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని స్థానికులు కొనియాడారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్‌ను శాలువతో సన్మానించారు. తమవంతు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
మీర్జాల్‌గూడలో వరద ముప్పుపై అధ్యయనం..
మల్కాజిగిరి పరిధిలోని మీర్జాల్గూడ చిన్మయిమార్గ్ ప్రాంతాలను హైడ్రా అదనపు సంచాలకులు శ్రీ వర్ల పాపయ్య గారు. మల్కాజిగిరి జోనల్ కమిషనర్ శ్రీ సంచిత్ గంగ్వార్ గారితో కలిసి హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు పరిశీలించారు. వర్షాకాలంలో ఎగువ నుంచి భారీ మొత్తంలో వచ్చిన వరదతో తమ ప్రాంతాలన్నీనీట మునుగుతున్నాయని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సమస్య పరిష్కారానికి ఉన్న అవకాశాలను ఇరువురు అధికారులు క్షేత్ర స్థాయిలో సమీక్షించారు. పైనుంచి వచ్చే వరద సాఫీగా వెళ్లేందుకు అవకాశం లేకుండా కాలువలు కుంచించుకుపోయినట్టు గుర్తించారు. స్థానికులతో కూడా మాట్లాడారు. చిన్మయి మార్గ్ విస్తరణ చేపట్టాలని ఈ సందర్భంగా స్థానికులు అధికారులను కోరారు. మహేద్రహిల్స్ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తోందని.. ఇక్కడ కేవలం ఒక మీటరు వెడల్పుతో నాలా ఉండడంతో సరిపోవడంలేదని ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఉన్న అండర్ డ్రైనేజీ కాలువను విస్తరించాలా.. సమాంతరంగా మరో కాలువను నిర్మించాలా అనే విషయాలను పరిశీలించాలని అధికారులకు హైడ్రా కమిషనర్ సూచించారు. కాలువల విస్తరణ పనులను చేపడతామని.. అందరూ సహకరించాలని స్థానికులను హైడ్రా కమిషనర్ కోరారు. పనులు జాప్యం కాకుండా చూడాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.