- “రైతు నేస్తం’ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- రైతులతో ముఖాముఖి మాట్లాడి యూరియా యాప్ పై వారి అభిప్రాయాలు సేకరించిన మంత్రి తుమ్మల
- యూరియా ఆప్ పై హర్షం వ్యక్తం చేసిన రైతులు
- అధిక యూరియా వాడకం వల్ల భూసారం తగ్గిపోతుంది, చీడల పీడ పెరుగుతుంది
ప్రతి మంగళవారం నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా.. రైతునేస్తం కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సచివాలయం నుండి హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖి మాట్లాడిన మంత్రిగారు.. యూరియా యాప్ మరియు యూరియా వినియోగం వంటి అంశాలపై రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతునేస్తం కార్యక్రమంలో రైతులు అధికంగా పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు, రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. యూరియా యాప్ పై రైతుల అభిప్రాయాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. యూరియా యాప్ తో లైన్లలో నిలబడే బాధ తప్పిందని, ఇంట్లో నుంచే యూరియాను బుక్ చేసుకోని, ఉచిత సమయంలో తెచ్చుకునేందుకు వీలు కలిగిందని, దీంతో సమయం వృథా కాకుండా ఉందని రైతులు యూరియా యాప్ ని కొనియాడారు. భవిష్యత్తులో కూడా యూరియా యాప్ తోనే యూరియా అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రిగారిని రైతులు కోరారు.
రైతుల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకొని, రైతుల అభిప్రాయాల మేరకే ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రిగారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అధిక యూరియా వాడకం ద్వారా వచ్చే అనర్థాలను రైతులకు మంత్రి వివరించారు. దేశంలోనే అధికంగా యూరియా వాడుతున్న రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఉందని, ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. రైతులు యూరియాను అధికంగా వినియోగించవద్దని కోరారు. యూరియాను అధికంగా వాడటం వల్ల, నేల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు, రానురాను దిగుబడులు కూడా తగ్గుతాయని, చీడ పీడల సమస్యలు పెరుగుతాయని తెలిపారు. ఇప్పుడు పంటల కోతల సమయం వచ్చిందని, రైతులు కోతల అనంతరం వచ్చే పంట వ్యర్థాలను కాల్చవద్దని అన్నారు. పంట వ్యర్థాలను కాల్చడం ద్వారా పర్యావరణం దెబ్బతింటుందని తెలిపారు. రైతులు తాము పండించే అన్ని పంటలలో పామాయిల్ పంటను కూడా వేయవచ్చని, పామాయిల్ పంటను వేసి కూడా వరి, పత్తి, మొక్కజొన్న లాంటి పంటలు పండించుకోవచ్చని రైతులకు వివరించారు. రైతులందరు పామాయిల్ పంటను వేసినట్లయితే స్థిరమైన అధిక ఆదాయం పొందే వీలుంటుందని అన్నారు.
మంత్రిని కలిసిన హుజురాబాద్ మున్సిపల్ పాలకవర్గం:
ఈ రోజు సచివాలయంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు, సర్పంచ్ లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ప్రతిపాదించిన డంపింగ్ యార్డు పనులను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఒడితల ప్రణవ్ పాల్గొన్నారు.