ఆర్టీసీ సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర మంత్రివర్గం విజ్ఞప్తి చేసింది. ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటించాలని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మీ సమస్యలను పరిష్కరించాలనే సానుకూల వైఖరితోనే ప్రభుత్వం అధికారుల కమిటీ వేసింది. రేపు ఉప ముఖ్యమంత్రి అధ్వర్యంలో చర్చలకు రావాలని కార్మిక సంఘాలకు మంత్రివర్గం విజ్ఞప్తి చేసింది.
కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రివర్గం చర్చించింది. జ్యుడిషియల్ కమిషన్ నియామకాన్ని హైకోర్టు తప్పుబట్టలేదు. కమిషన్ ఇచ్చిన నివేదికను కూడా హైకోర్టు తప్పుబట్టలేదు. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమని, రాజ్యాంగబద్ధమని కూడా అభిప్రాయపడింది. పిటిషనర్లకు నోటీసులు ఇవ్వలేదనే కేవలం సాంకేతిక కారణాలను హైకోర్టు తప్పుబట్టింది. ఈ నివేదికలో వారిపై ప్రస్తావించిన అంశాలు అమల్లో ఉండవని, వాటి ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మాత్రమే తీర్పునిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, లోపాలు, అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. తొమ్మిది నెలలైనా సీబీఐ దర్యాప్తు ఇంకా ప్రారంభం కాలేదు. హైకోర్టు తీర్పు సీబీఐ దర్యాప్తునకు ఎలాంటి అడ్డంకిగా లేదని న్యాయ నిపుణులు తెలియజేశారు. అందుకే సీబీఐ దర్యాప్తును వేగవంతం చేయాలని ప్రభుత్వం తరఫున మరోసారి సీబీఐని కోరాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పు మొత్తం పరిశీలించిన తర్వాత ఢిల్లీలో ఉన్న న్యాయ నిపుణులతో సంప్రదించి, సుప్రీంకోర్టుకు వెళ్లాలా.. లేదా.. అనేది, వారిచ్చే సలహాలు సూచనల ఆధారంగా నడుచుకోవాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
గతంలో పదేండ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టింది. తెలంగాణ ఏర్పడే నాటికి ఒక్క రూపాయి కూడా బకాయి లేదు. రిటైర్మెంట్ ఏజ్ పెంచటంతో పాటు రిటైరైన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకపోవటంతో రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. రాష్ట్ర మంత్రివర్గం ఈ సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రిటైర్డ్ ఉద్యోగులు ఆఫీసుల చుట్టూ, సచివాలయం చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా వెంటనే వారికి ఇచ్చే బకాయిల చెల్లింపులకు తగిన చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి రూ.6,200 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సినవి రూ.8 వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వీటిని వెంటనే ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పటికీ వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలన్నీ అన్వేషించి, అవసరమైన నిధులు సర్దుబాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అవసరమైతే తమ జీతాలు, ప్రజా ప్రతినిధులకు ఇచ్చే జీతాల నుంచి 50 శాతం రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే సర్దుబాటు చేయాలని మంత్రులందరూ ఉదారంగా ముందుకువచ్చారు. రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలు, బాధ్యులైన వారందరినీ పిలిచి చర్చలు జరపాలని, వీలైనంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వంద రోజుల్లోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపు దిశగా తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో పదవీ కాలం పూర్తయిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు (PACS) నామినేట్ పద్ధతిన పాలకవర్గాలను నియమించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
గచ్చిబౌలి స్టేడియాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 76 ఎకరాల్లో 64 ఎకరాల్లో 21 రకాల స్పోర్స్ీకు సంబంధించిన సౌకర్యాలు కల్పించడంతో పాటు అవుట్ డోర్ స్టేడియం సామర్థ్యం 20 వేల నుంచి 50 వేలకు పెంచాలని నిర్ణయించింది. స్విమ్మింగ్ పూల్ సామర్థ్యం పెంపుతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు… క్రీడాకారులకు వసతి, శిక్షణ సౌకర్యాలు కల్పించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మిగిలిన 12 ఎకరాలను డెవలపర్స్ కు ఇచ్చి కమర్షియల్ యాక్టవిటీస్‌కు అనుమతి… కమర్షియల్ యాక్టవిటీస్తో వచ్చే రెవెన్యూను స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్వహణ, క్రీడాకారుల వసతి, శిక్షణ ఇతర కార్యక్రమాలకు ఉపయోగించాలని కేబినెట్ నిర్ణయించింది.
మంథని నియోజకవర్గ ప్రాంత ప్రజల చిరకాల కోరిక చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేయాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. మహాదేవ్‌పూర్, కాటారం, మల్హర్ రావు, మహముత్తారం మండలాల్లో దాదాపు 45 వేల ఎకరాలకు, 63 గ్రామాల ప్రజలకు ఈ ప్రాజెక్టుతో ప్రయోజనం చేకూరుతుంది. భూసేకరణ కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. ఈ ప్రాజెక్టుకు దాదాపు 2427 ఎకరాల భూమి అవసరం. ఇప్పటివరకు 1020 ఎకరాలు సేకరించారు. మిగిలిన భూసేకరణకు అవసరమయ్యే రూ.166.67 కోట్ల ప్రతిపాదనలకు కేబినేట్ ఆమోదం తెలిపింది.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాల్లో మంచిర్యాల జిల్లా హాజీపూర్ రెవెన్యూ పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్‌కు చెందిన 85.10 ఎకరాలను మత్స్య శాఖకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.