శుక్రవారం నుంచి సనత్‌నగర్‌‌ టిమ్స్‌లో ట్రయల్ రన్: మంత్రి దామోదర్ రాజనర్సింహ

  • నెల రోజుల పాటు 22 విభాగాల్లో ఓపీ సేవలు
  • అధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశం

సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌)ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు.. శుక్రవారం నుంచి హాస్పిటల్‌లో ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం నుంచి సుమారు నెల రోజుల పాటు ట్రయల్ రన్ కొనసాగనుంది. ట్రయల్‌ రన్‌లో భాగంగా రోజూ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అవుట్‌ పేషెంట్‌, డయాగ్నసిస్ సేవలు అందించనున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీతో పాటు మొత్తం 22 విభాగాల్లో ట్రయల్ రన్ జరగనుంది. ఇందుకోసం అవసరమైన డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బందిని అధికారులు నియమించారు.