మ‌రో రెండు నెల‌ల్లో మ‌రో రెండు ల‌క్ష‌లు పూర్తి చేస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • స్వ‌తంత్ర భార‌త దేశ చ‌రిత్ర‌లోనే అతిపెద్ద గృహ విప్ల‌వం
  • ఇందిర‌మ్మ ఇళ్లతో దేశానికి తెలంగాణ మార్గ‌ద‌ర్శ‌కం
  • 13నెల‌ల్లో ల‌క్ష ఇళ్లు పూర్తి
  • జూన్‌1న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రెండ‌వ విడ‌త‌కు శ్రీ‌కారం కొత్తగూడలో సామూహిక గృహప్రవేశాలు
  • ఈ ఏడాది 3.50 ల‌క్ష‌ల ఇళ్ల మంజూరు

హైదరాబాద్ : ఏడు ద‌శాబ్దాల స్వ‌తంత్ర భార‌తదేశ చ‌రిత్ర‌లో ఎన్నడూ లేని విధంగా పేద‌ల సొంతింటి క‌ల‌ల‌ను నెర‌వేర్చ‌డానికి ఉచితంగా ఐదు ల‌క్ష‌ల రూపాయిల‌తో భారీ గృహ నిర్మాణ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికి మార్గ‌ద‌ర్శకంగా నిలుస్తోంద‌ని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇప్పుడు కేవలం గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాకుండా పేద కుటుంబాల జీవితాలను మార్చేస్తున్న సామాజిక ఉద్యమంగా మారిందని అన్నారు. స్వతంత్ర భారత చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌లు, స‌ల‌హాలు సూచ‌న‌ల మేర‌కు భారీ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టి తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా ఇండ్ల‌ను మంజూరు చేశామ‌ని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 1న ఆసిఫాబాద్ జిల్లా క‌ర‌మెర మండ‌లం కొఠారి గ్రామంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రెండ‌వ విడ‌త‌కు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నామ‌ని ప్ర‌క‌టించారు. అలాగే కొత్తగూడలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు, రెండో విడత‌లో 2.5 లక్షల ఇళ్ల మంజూరుతో రెండు విడ‌తల్లో క‌లిపి ఒక్కో నియోజ‌క‌వ‌ర్గానికి 5500 నుంచి 6,500 ఇళ్ల‌ను మంజూరు చేసిన‌ట్లు అవుతుంద‌న్నారు. ఐటిడిఎ ప్రాంతాల్లోని గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గాల‌కు అద‌నంగా 500 నుంచి 1500 వ‌ర‌కు మంజూరు చేశామ‌ని తెలిపారు. తాము ఆశించిన స్ధాయిలో మొదటి విడ‌త‌లో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణ కార్య‌క్ర‌మం విజ‌య‌వంత‌మైంద‌ని గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రి మూడవ వారంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నారాయ‌ణ‌పేట జిల్లాలో ఇందిర‌మ్మ ఇళ్ల‌కు శంకుస్ధాప‌న చేశార‌ని, ఈ 13 నెల‌ల్లో ల‌క్ష ఇళ్ల‌ను పూర్తి చేసుకొని మ‌రో ఒక‌టి రెండు నెల‌ల్లో మ‌రో రెండు ల‌క్ష‌ల ఇళ్లు పూర్తికాబోతున్నాయ‌ని తెలిపారు. ఇది ఏర‌కంగా చూసినా దేశానికే ఆద‌ర్శ‌వంతంగా ఒక రోల్ మోడ‌ల్‌గా నిలుస్తుంద‌ని అన్నారు. ఈ ఏడాది 2026-27 ఆర్ధిక సంవ‌త్స‌రానికి గాను క్యూర్ ప‌రిధిలో ల‌క్ష ఇళ్లకు రాష్టం లోని ఇత‌ర ప్రాంతాల్లో 2.50 ల‌క్ష‌లు మొత్తం 3.50 ల‌క్ష‌ల ఇళ్ల మంజూరుకు ప‌రిపాల‌నా అనుమ‌తులు ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు.
ఒక ప్ర‌ణాళికా బ‌ద్దంగా మొద‌టి విడ‌త‌లో ఎదురైన మంచి చెడుల‌ను ప‌రిగ‌ణ‌న‌లో తీసుకొని మ‌రింత ప‌టిష్టంగా రెండోవిడ‌త కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేయాల‌ని ఇప్పటికే అధికారుల‌ను ఆదేశించడం జరిగిందన్నారు.

దేశంలోని చాలా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిమిత నిధులతోనే గృహ నిర్మాణాలను కొనసాగిస్తున్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం పేదవాడి ఇల్లు – ప్రభుత్వ బాధ్యత అనే లక్ష్యంతో స్వంత నిధులతో ముందుకు సాగుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రం కేవలం రూ.72 వేలే, పట్టణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు మాత్రమే ఇస్తున్నా, తెలంగాణ ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారునికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. స్వ‌ర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి 2013 వరకు అమ‌లు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇండ్లు మంజురై, ఇప్ప‌టికీ అసంపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తి చేయడానికి, 2023 లో గృహ లక్ష్మి పథకంలో ఇండ్లు మంజూరై ఇప్ప‌టికీ పూర్తి చేసుకోలేకపోయిన వారికి రెండ‌వ విడ‌త‌లో ఆ ఇంటి నిర్మాణం పూర్తి అవ‌డానికి అవ‌స‌ర‌మ‌య్యే ఆర్ధిక‌సాయాన్ని అందిస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన ఇందిర‌మ్మ ప‌ధ‌కంలో 20వేల రూపాయిల వ‌ర‌కు ఆర్ధిక‌సాయం పొందిన‌వారికి కూడా ఈ విడ‌త‌లో ఇండ్ల మంజూరు చేయాల‌ని నిర్ణయించినట్లు తెలిపారు.