- చెరువులతో నగరానికి జీవకళ తెద్దాం
- ప్రకృతిని పరిరక్షించుకుందామంటూ హైడ్రా ప్రచారం
- ముఖ్యమైన కూడళ్లలో ప్లకార్డులను ప్రదర్శించిన హైడ్రా
గొలుసుకట్టు చెరువులను కాపాడుకుందాం.. చెరువులతో నగరానికి జీవకళ తీసుకువద్దాం.. ప్రకృతిని పరిరక్షిద్దాం.. పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యమౌదాం అంటూ నగరంలో హైడ్రా నినదించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నగరంలోని పలు ముఖ్యమైన కూడళ్లు, క్రీడామైదానాలు వద్ద ప్రకృతి పరిరక్షణపై చైతన్య కార్యక్రమాన్నిహైడ్రా చేపట్టింది. ట్రాఫిక్ పోలీసులు, ఐటీ ఉద్యోగులు, చిన్నారులు, నగర ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై భవిష్యత్ నగరానికి బాటలు వేశారు. మన చెరువులు మన భవిష్యత్.., హైడ్రాతో కలసి చెరువులను పరిరక్షించుకుందాం, సేవ్ వాటర్ సేవ్ లైఫ్, పర్యావరణంతో మెరుగైన జీవితం అంటూ నినదించారు. బాలాపూర్ చౌరస్తా, అమీర్‌పేటలోని మైత్రివనం, ఆరాంఘర్ చౌరస్తా, కర్బలా జంక్షన్, ఎల్.బి.నగర్త, హైటెక్‌సిటీ, గోల్కొండ, సికింద్రాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టారు. హైడ్రా ఆర్ ఎఫ్‌వో శ్రీ జయప్రకాష్, డీఆర్ఎఫ్ బృందాలు, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు, వాహనదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలు, పరిశుభ్రమైన పరిసరాల అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించారు. భూమిని పచ్చదనంతో నింపేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను సంరక్షించాలని పిలుపునిచ్చారు. అలాగే నీటి వనరులను కాపాడుకోవడం, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా పరిశుభ్రత పాటించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని వివరించారు. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యతగా భావించి అందరూ భాగస్వాములు కావాలని హైడ్రా అధికారులు కోరారు. కార్యక్రమం ద్వారా ప్రజల్లో పర్యావరణంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు.