కాలుష్య కారక ఎంఎస్‌ అగర్వాల్‌ స్టీల్‌ పరిశ్రమ వద్దే వద్దు..!

  • ఎంఎస్‌ అగర్వాల్‌ స్టీల్‌ పరిశ్రమ విస్తరణను వ్యతిరేకిస్తున్న స్థానికులు
  • ఇటీవల కంపెనీ విస్తరణ కోసం భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ
  • ప్రజాభిప్రాయ సేకరణలో తమ గొంతునొక్కారని ప్రజల ఆవేదన
  • ఫ్యాక్టరీ విస్తరణ వద్దని మెదక్‌ కలెక్టర్‌కు వినతి
  • అనుమతులు రద్దు చేయాలని డిమాండ్‌
  • పరిశ్రమ కారణంగా జల, వాయు, నేల కాలుష్యం
  • స్థానికుల పొట్టకొట్టి బీహారు లేబర్‌తో పనులు
  • రంగాయిపల్లి, చెట్ల గౌరారం రైతులు, ప్రజలకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ పోరాటం
  • ఆదివారం వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష

పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఎంఎస్‌ అగర్వాల్‌ స్టీల్‌ పరిశ్రమ విస్తరణ పనులను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. పరిశ్రమ కారణంగా గాలి, నీరు, నేల కాలుష్యం జరిగి ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని పలు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ విస్తరణ పనులకు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వరాదని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. కంపెనీ అనుమతులు రద్దు చేయాలని నాలుగు రోజులుగా బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు.

మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలంలోని రంగాయిపల్లి, చెట్ల గౌరారం గ్రామాల పరిధిలో 200 ఎకరాల్లో ఏర్పాటైన ఎంఎస్‌ అగర్వాల్‌ స్టీల్‌ పరిశ్రమతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటా 6 లక్షల టన్నుల స్టీల్‌ రాడ్లను ఈ పరిశ్రమ ఉత్పత్తి చేస్తున్నది. పరిశ్రమ విస్తరించి, ఏటా 70 లక్షల టన్నుల స్టీల్‌ రాడ్ల ఉత్పత్తి చేయాలని విస్తరణ ప్రణాళికా పెట్టుకున్నది. కాగా, పరిశ్రమ విస్తరణకు అనుమతులు ఇవ్వరాదని ఆయా గ్రామాల ప్రజలు మెదక్‌ కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ దృష్టికి తీసుకెళ్లారు.

పరిశ్రమ యాజమాన్యం ఫ్యాక్టరీ విస్తరణ కోసం అధికారులు ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. పరిశ్రమ వదులుతున్న కాలుష్యంతో తాము తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నామని అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ నుంచి వెలువడుతున్న ధూళి, పొగ, పారిశ్రామిక వ్యర్థాల కారణంగా శ్వాసకోశ, చర్మ సంబంధిత వ్యాధులలో పాటు ఇతర అనారోగ్య సమస్యల బారినపడుతున్నామని పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు కాలుషితం కావడంతో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అధికారులకు తెలిపినా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జల కాలుష్యంతో వ్యవసాయ భూముల్లో భూసారం తగ్గి పంటలకు నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నాఉ. రంగాయిపల్లి, చెట్ల గౌరారం గ్రామాలతో పాటు సమీప గ్రామాల ప్రజలు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న కంపెనీతోనే ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, ఇంకా విస్తరణకు ప్రభుత్వం అనుమతులు ఇస్తే తాము ఇక్కడ బతకలేమని ప్రజలు వాపోతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం కంపెనీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాలుష్య నివారణకు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రజాభిప్రాయ సేకరణపై అభ్యంతరం…

ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సక్రమంగా జరగలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాము మాట్లాడేందుకు ్గఅవకాశం ఇవ్వలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వెల్లండించకుండా పోలీసులతో కట్టడి చేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. తాము పరిశ్రమ విస్తరణ వద్దంటే, ప్రభుత్వం పరిశ్రమకు అనుకూలంగా వ్యవహరించడం తగదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కంపెనీలో స్థానికులకు ఉపాధి లేదు

మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలంలో ఎంఎస్‌ అగర్వాల్‌ స్టీల్‌ పరిశ్రమలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కలిపించడం లేదు. కంపెనీ యాజమాన్యం బీహారు నుంచి కూలీలను తెచ్చి పనులు చేయిస్తున్నదని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. కంపెనీలో ప్రమాదం జరిగి కూలీలు చనిపోయినా నష్టపరిహారం చెల్లించడం లేదని పరిశ్రమపై ఆరోపణలు వస్తున్నాయి.

20 ఏండ్లుగా ప్రజలకు ఇబ్బందులు

ఎంఎస్‌ అగర్వాల్‌ స్టీల్‌ పరిశ్రమ కాలుష్యంతో ఇరవై ఏండ్లుగా సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాయు, జల, నేల కాలుష్యం జరుగుతున్నది. కంపెనీలో స్థానికులకు ఉపాధి కల్పించడం లేదు. బీహారు కూలీలతో పరిశ్రమను నడుపుతున్నారు. కంపెనీలో ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోతే ఫ్యాక్టరీ వద్దకు స్థానికులు వెళ్తే పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. పోలీస్‌ బలగాలతో ప్రజలను అణచివేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఎక్కడి నుంచో ఎన్‌జీవోలను తెచ్చి అనుకూలంగా మాట్లాడించారు. ప్రజాభిప్రాయ సేకరణపై గ్రామస్తులకు ముందస్తుగా సమచారం ఇవ్వలేదు. అధికారులు కంపెనీ వద్ద ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారనే సమాచారంతో ఫ్యాక్టరీ వద్దకు వెళ్తే పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. కంపెనీపై మెదక్‌ కలెక్టర్‌కు ఫిర్యా దు చేశాం. మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశాం. రంగాయిపల్లి, చెట్లగౌరారం గ్రామస్తుల సమక్షంలో ప్రభుత్వం ప్రజాభియ్ర సేకరణ చేయాలి. కంపెనీకి వ్యతిరేకంగా ఆదివారం పెద్దఎత్తున నిరాహార దీక్ష చేస్తాం. – వంటేరు ప్రతాప్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకర్గ ఇన్‌చార్జి (సోర్స్: NT)