‘వోకల్ ఫర్ లోకల్’ భావనకు అనుగుణంగా స్థానిక ఉత్పత్తులను ప్రజలు ఆదరించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

  • • ఈ నెల 16 నుండి 26 వరకు ‘‘బోనాలు- చేతివృత్తుల మేళా’’
  • • ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కొనసాగుతున్న ప్రదర్శనలు

హైదరాబాద్ : చేతి వృత్తి కళాకారులకు చేయూతనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వ బిసి సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ‘‘బోనాలు- చేతివృత్తుల మేళా, బిసి చేతివృత్తుల అమ్మకాలు- ప్రదర్శన’’ను ఈనెల 16వ తేదీ నుండి 26 వరకు ట్యాంక్ బండ్, అంబేద్కర్ విగ్రహము ప్రక్కన గల HMDA గ్రౌండ్స్ లో నిర్వహిస్తోంది. చేతివృత్తుల కళాకారులచే తయారు చేసిన వివిధ వస్తువుల ప్రదర్శన, విక్రయము (Exhibition) విజయవంతంగా కొనసాగుతున్నది. ఈ ప్రదర్శనలో కుమ్మరులు వారు తయారు చేసిన మట్టిపాత్రలు, గౌడన్నల ‘నీరా’ స్టాల్, మేదరివారు తయారు చేసిన వెదురు వస్తువులు, హ్యాండ్ లూమ్స్ (పోచంపల్లి-ఇక్కత్, గద్వాల్ – నారాయణపేట్), పూసలవారి సామగ్రి, మహిళా స్వయం సహాయక సంఘాల స్వగృహ ఫుడ్స్, ఇతర బిసి వర్గాలచే తయారు చేయబడిన వస్తువులు, తెలంగాణ వంటకాలు, బెస్త (మత్స్య కారులు) సోదరులచే తయారు చేయబడే చేప వంటకాలు, ఇతర భోజన స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రదర్శనలో లభించే వస్తువులు వినియోగదారులకు, సందర్శకులకు సరసమైన ధరలలో లభ్యమవుతున్నాయి. ఈ ప్రదర్శన ప్రతిరోజు ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 10:00 గంటల వరకు కొనసాగుతున్నది. ప్రభుత్వం సందర్శకులకు ప్రవేశము ఉచితంగా కల్పిస్తున్నది. ప్రదర్శనలో వివిధ రంగాలకు చెందిన 60 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి వస్తున్న విశేష ఆదరణతో స్టాల్స్ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన చేనేత, హస్తకళలు, మట్టి కళలు, చెక్క బొమ్మలు వంటి సంప్రదాయ కళలను ప్రోత్సహించడమే ఈ మేళా ప్రధాన లక్ష్యమని, గ్రామీణ కళాకారుల ప్రతిభకు మార్కెట్ కల్పిస్తూ వారి జీవనోపాధిని బలోపేతం చేయడంలో ఇటువంటి మేళాలు కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్ర బిసి సంక్షేమశాఖ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ‘వోకల్ ఫర్ లోకల్’ భావనకు అనుగుణంగా స్థానిక ఉత్పత్తులను ప్రజలు ఆదరించాలని, సాంప్రదాయ కళలను నేటి తరానికి పరిచయం చేసి, భావితరాలకు అందించడం మన అందరి బాధ్యత అని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కళాకారుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, మార్కెటింగ్ అవకాశాల విస్తరణకు కట్టుబడి ఉందన్నారు.
ఈ మేళాలో పాల్గొన్న ప్రతి కళాకారుడికి అభినందనలు తెలియజేస్తూ, ప్రజలు పెద్ద ఎత్తున సందర్శించి హస్తకళ ఉత్పత్తులను కొనుగోలు చేసి కళాకారులను ప్రోత్సహించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మన కళలు, మన చేతివృత్తులు– మన సంపద అనే భావనతో ప్రతి ఒక్కరూ ఈ మేళాను విజయవంతం చేయాలన్నారు. బోనాల పండుగకు అవసరమైన బోనం కుండలతో పాటు సంప్రదాయ ఆచారాలకు ఉపయోగించే వివిధ రకాల వస్తువులను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానంలో అంతర్భాగమైన అనేక కులవృత్తులు కనుమరుగు అవ్వకుండా మరింతగా ప్రోత్సహించెందుకు ప్రభుత్వం ప్రదర్శనను ఏర్పాటు చేసింది.