కొడంగల్ అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

  • ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనుల్లోనూ వేగం పెరగాలి
  • ఆగస్టు 30 న మళ్లీ వస్తా…
  • పురోగతిపై సమీక్ష చేసి ఇక్కడే బస చేస్తా

కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ ను సీఎం పరిశీలించారు. అనంతరం అక్కడే కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనుల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నీటిపారుదల శాఖకు సంబంధించి మక్తల్-నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం ఆరా తీశారు. ప్రాజెక్టు భూ సేకరణ విషయంలో జాప్యం జరగొద్దని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు భూసేకరణకు అవసరమైన సర్వేయర్లతో పాటు బడ్జెట్ మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేయాలనారు. భూసేకరణ పూర్తి చేసి టెండర్ ప్రాసెస్ మొదలు పెట్టాలని తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధిపై సీఎం పలు కీలక సూచనలు చేశారు. గ్రామాల్లో రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనలో పురోగతిపై అధికారులకు ఆదేశాలిచ్చారు. నియోజకవర్గంలో ఏ తండాలో రోడ్డు లేదన్న మాట వినిపించొద్దని, ప్రతీ గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండేలా చూడాలన్నారు. కొత్త గ్రామ పంచాయతీలకు సంబంధించి గ్రామపంచాయతీ భవనాలను నిర్మించాలని తెలిపారు. ఈఈ స్థాయి అధికారిని నియమించి నిరంతరం పనులు పర్యవేక్షించాలని సూచించారు. ఎల్నినో నేపథ్యంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీలతోపాటు బస్ స్టేషన్స్ నిర్మాణం, చెరువుల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు

హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనుల పరిశీలన
హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ లో నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనులు నిదానంగా సాగడంపై అధికారులపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎడ్యుకేషన్ హబ్ లో ప్రతీ ప్రాజెక్టుకు సంబంధించి నెలవారీ పురోగతిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని సూచించారు. పనుల్లో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెన్షన్ కు వెనకాడొద్దని ఆదేశించారు. హబ్ కు భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో జాప్యం జరగడంపై అధికారులపై సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వారంలోగా ప్లాట్ల పట్టాలు లబ్ధిదారులకు అందజేయాలని ఆదేశించారు. ఎడ్యుకేషన్ హబ్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఇంజనీరింగ్ కళాశాల, హాస్టల్స్, వెటర్నరీ కళాశాల, ప్రభుత్వ మెడికల్, నర్సింగ్, ఫిజియో థెరపీ& పారా మెడికల్ కళాశాలల నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఇకనుంచి ప్రతీ నెలా పనుల పురోగతిపై పరిశీలిస్తానని… ప్రతీ నెల ఒక రోజు సైట్ లోనే బస చేస్తానని అధికారులకు తెలిపారు. ఆగస్టు 30 న మళ్లీ వస్తానని, ఎడ్యుకేషన్ హబ్ లోనే సమీక్ష నిర్వహించి అక్కడే బస చేస్తానని సీఎం తెలిపారు. పర్యటనలో సీఎంతో పాటు ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో పాటు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.