రాష్ట్రంలో పవర్ కట్ అనేదే లేదు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • 7 వేల మెగావాట్ల ‘ఎల్ నినో’ షాక్‌ను తట్టుకున్న విద్యుత్ వ్యవస్థ
  • వర్షాకాలంలోనూ వేసవిని తలపించిన 16,500 మెగావాట్ల పీక్ డిమాండ్
  • 2 వేల మెగావాట్ల జల విద్యుత్ నిలిచినా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా
  • దేశంలోనే తొలిసారిగా ‘ఎలక్ట్రిసిటీ ఆంబ్యులెన్స్’, 1912 హెల్ప్‌లైన్‌కు కృత్రిమ మేధ (AI)
  • అప్పుల రీస్ట్రక్చరింగ్‌తో డిస్కంలను నంబర్-1గా తీర్చిదిద్దే ప్రణాళికలు
  • ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష

‘ఎల్ నినో’ ప్రతికూల వాతావరణ ప్రభావంతో వర్షాకాలంలోనూ వేసవిని తలపించిన విద్యుత్ డిమాండ్, పడిపోయిన జల విద్యుత్ ఉత్పత్తితో ఒకేసారి పడిన 7,000 మెగావాట్ల అదనపు భారాన్ని తెలంగాణ విద్యుత్ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా తట్టుకుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. సాధారణంగా వర్షాకాలంలో 11,000 మెగావాట్లుగా ఉండే పీక్ డిమాండ్ అనూహ్యంగా 16,500 మెగావాట్లకు చేరడం, మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేక 2,000 మెగావాట్ల జల విద్యుత్ (హైడల్ పవర్) నిలిచిపోవడం డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థపై తీవ్రమైన షాక్ లాంటి ఒత్తిడిని తెచ్చిందన్నారు. అయినప్పటికీ, విద్యుత్ సిబ్బంది అహర్నిశలు శ్రమించి, ముందుచూపుతో పక్కా ప్రణాళికలను అమలు చేయడం వల్లే ఈ సంక్లిష్ట పరిస్థితులను దాటుకొని ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా ఉచిత, నాణ్యమైన విద్యుత్‌ను అందించగలుగుతున్నామన్నారు. హనుమకొండలోని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (NPDCL) ప్రధాన కార్యాలయంలో విద్యుత్ రంగ ప్రగతిపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు సీఎండీ వరుణ్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ NPDCL పరిధిలోని కాళేశ్వరం, దేవాదుల, సీతారామ వంటి బృహత్తర ఎత్తిపోతల పథకాలతో పాటు వర్షాభావంతో రైతులు బోర్ వెల్స్ ఎక్కువగా వాడటం వల్ల పెరిగిన విద్యుత్ అవసరాలను ప్రభుత్వం విజయవంతంగా మేనేజ్ చేసిందన్నారు. రాష్ట్రంలో ‘పవర్ కట్’ అనేదే లేదని, వర్షాలు, ఈదురుగాలుల వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల స్తంభాలు, లైన్లపై చెట్లు కూలినప్పుడు మాత్రమే తాత్కాలికంగా విద్యుత్ అంతరాయం (Interruption) కలుగుతుందని, దీనిని ప్రజలు పవర్ కట్‌గా భావించవద్దని స్పష్టం చేశారు. ‘ప్రజా బాట’, ‘పొలం బాట’ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా అధికారులు స్వయంగా ప్రజల వద్దకే వెళ్తూ సమస్యలను పరిష్కరిస్తున్నారని అభినందించారు.
గతంలో ఎక్కువ వడ్డీలతో తెచ్చిన పాత రుణాలను ‘రీస్ట్రక్చరింగ్’ చేయడం ద్వారా సంస్థల రుణభారం తగ్గించి, NPDCL, SPDCL డిస్కంలను దేశంలోనే నంబర్-1 స్థానంలో నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు. విద్యుత్ సేవా ప్రమాణాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు దేశంలోనే ప్రథమంగా తెలంగాణలో ఎలక్ట్రిసిటీ ఆంబ్యులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించారు. గతంలో వైద్యారోగ్య శాఖలో 108 ఆంబ్యులెన్స్ సేవలు తీసుకొచ్చిన తరహాలోనే, ఇప్పుడు విద్యుత్ అత్యవసర సమస్యల కోసం ట్రాన్స్‌ఫార్మర్లు, నిచ్చెనలు, వైర్లతో పాటు నిపుణులైన ఇంజనీర్లు నిరంతరం అందుబాటులో ఉండేలా ఈ వాహనాలను రంగంలోకి దించామన్నారు. వినియోగదారులు ఉచిత టోల్ ఫ్రీ నంబర్1912 కు ఫోన్ చేయగానే, కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికత ద్వారా సమాచారాన్ని స్వీకరించి, ఆటోమేటిక్‌గా క్షణాల్లో సమాచారాన్ని ఆంబ్యులెన్స్ సిబ్బందికి చేరవేస్తుందని… మెసేజ్ ఆధారంగా ఆంబ్యులెన్స్ నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకుని సమస్యను తక్షణమే పరిష్కరిస్తుందని వివరించారు.

విద్యుత్ వ్యవస్థకు మూలస్తంభాలైన లైన్‌మెన్లు, ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని ఉద్ఘాటిస్తూ… విధి నిర్వహణలో అనుకోకుండా ప్రమాదం జరిగి సిబ్బంది మరణిస్తే ఆ కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు రూ. 1.20 కోట్లు బీమా సౌకర్యాన్ని కల్పించామని తెలిపారు. అలాగే లైన్ క్లియరెన్స్ సమయంలో ప్రమాదాలను అరికట్టేందుకు అవసరమైన సేఫ్టీ కిట్లు, యూనిఫారాలు అందించినట్లు పేర్కొన్నారు. మరోవైపు ‘గృహజ్యోతి’ పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందుతున్న 53 లక్షల కుటుంబాల బిల్లుల మొత్తాన్ని ఆర్థిక శాఖ డిస్కం కంపెనీలకు చెల్లిస్తోందని తెలిపారు. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30 లక్షల వ్యవసాయ పంప్‌సెట్లకు ఏటా అయ్యే రూ. 14,000 కోట్ల సబ్సిడీ నిధులను కూడా ఆర్థిక శాఖ నేరుగా డిస్కంలకు విడుదల చేస్తోందని వెల్లడించారు.