హైదరాబాద్ : మహేశ్వరంలోని తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నిదునాక్ష్మికంగా సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సోమవారం మహేశ్వరం మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌ను సందర్శించి పాఠశాలలో విద్యా బోధన, మౌలిక వసతులు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించిన ఆయన వారి విద్యాభ్యాసం, భవిష్యత్ లక్ష్యాలు, పోటీ పరీక్షలకు సన్నద్ధత, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాల పెంపు వంటి అంశాలపై విలువైన సూచనలు, మార్గదర్శకత్వం అందించారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర శ్రమతో ముందుకు సాగాలని ప్రధాన కార్యదర్శి సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొంటూ, ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా అవకాశాలు, సాంకేతిక వనరులు, గ్రంథాలయాలు, ప్రయోగశాలలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
అనంతరం పాఠశాలలోని తరగతి గదులు, సైన్స్ ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, వసతి గృహాలు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర మౌలిక వసతులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ఉపాధ్యాయులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, విద్యార్థులకు నాణ్యమైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన వసతుల మంజూరుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. పాఠశాల సమయాల్లో విద్యార్థుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) బస్సు సేవలను పాఠశాల వరకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులతో సమన్వయం చేసి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సందర్శన ముగింపులో పాఠశాల ఆవరణలో మొక్కను నాటిన ప్రధాన కార్యదర్శి, పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన, హరిత వాతావరణాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శశాంక్, కృష్ణ ఆదిత్య జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ), జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.