సాంకేతిక ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు అనుకూలంగా తెలంగాణ‌: సీఎం రేవంత్ రెడ్డి

  • స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులకు అభినంద‌న‌లు

ఢిల్లీ: అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్ట‌ప్‌ల ఏర్పాటుకు అనుకూల వాతావ‌ర‌ణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) పవన్ కుమార్ చందన, సహ వ్యవస్థాపకుడు, ముఖ్య నిర్వహణ అధికారి (సీఓఓ) నాగ భరత్ డాకా ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. భారతదేశంలోనే ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ వాహనం విక్రమ్-1ను విజయవంతంగా ప్రయోగించిన తీరును వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ విజయంతో అమెరికా, చైనా తర్వాత ప్రైవేటు రంగం ద్వారా ఆర్బిటల్ ప్రయోగ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలోని మూడో దేశంగా భారత్ నిలిచిందని తెలిపారు. సమావేశంలో తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, అంతరిక్ష సాంకేతిక రంగాల పురోగతి, ఆవిష్కరణలు, అధునాతన తయారీ, పరిశోధన-అభివృద్ధి (ఆర్ అండ్ డీ), ప్రభుత్వం–ప్రైవేటు అంతరిక్ష పరిశ్రమల మధ్య సహకార అవకాశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. వారు సాధించిన విజ‌యం భారతదేశాన్ని ప్రపంచ అంతరిక్ష రంగంలో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళుతుంద‌ని ప్రశంసించారు.