హైదరాబాద్ : హైదరాబాద్ నగరం, ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రధాన కార్యదర్శి ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతపై విస్తృతంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణ, ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు, అత్యవసర సేవలకు వేగవంతమైన మార్గాల కల్పన తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాలు, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు మున్సిపల్, పోలీస్, రవాణా తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. నవంబర్, డిసెంబర్ నాటికి అవసరమైన ప్రాంతాల్లో సిగ్నలింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
శాఖల మధ్య సమన్వయం
నార్కోటిక్ బ్యూరో, TG-SAFE తరహాలో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత కోసం TG-TMARS (Traffic Management and Road Safety) పేరుతో ప్రత్యేక, స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు ఎలక్ట్రానిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను మరింత పటిష్టం చేయాలని, గౌరవ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం 429 ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థలు ఉన్నాయని, వీటిలో అధునాతన సిగ్నల్ నియంత్రణ వ్యవస్థలను వినియోగిస్తున్నట్లు అధికారులు సీఎస్‌కు వివరించారు. ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత ఒకే శాఖకు పరిమితమైన అంశాలు కావని, పోలీస్, రవాణా, రోడ్లు-భవనాలు, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎస్ పేర్కొన్నారు. ప్రతి ప్రాంతానికి సంబంధించిన ట్రాఫిక్ డేటాను సమీకరించి, ఒకే వేదికపై విశ్లేషించేందుకు ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ డేటా ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా, సురక్షితంగా మార్చేందుకు కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎస్ సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగం కేవలం ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించడానికే పరిమితం కాకుండా, ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేలా ఉండాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారాలను గుర్తించేందుకు డేటా ఆధారిత, సాంకేతికత ఆధారిత, ప్రజా ప్రయోజనకరమైన విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా AI ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతకు సంబంధించి అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అధ్యయనం చేసి, అవసరమైన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టులను చేపట్టాలని సూచించారు. పైలట్ ప్రాజెక్టుల ఫలితాల ఆధారంగా వాటిని దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో డీజీపీ సి.వి. ఆనంద్, రవాణా, రోడ్లు-భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.