అసెంబ్లీ సమావేశాలకు సన్నద్ధం కండి: సీఎస్ సంజయ్ జాజు

  • అన్ని శాఖలు ముందస్తు సమాచారంతో సిద్ధంగా ఉండాలి
  • ప్రతి శాఖలో సమావేశాల కోసం నోడల్ అధికారిని నియమించుకోవాలి

హైదరాబాద్ : ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభ్యులు అడిగే ప్రశ్నలకు తగిన సమాధానాలను త్వరితగతిన అందించేందుకు అన్ని శాఖలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. గురువారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో అసెంబ్లీ సమేశాల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సిఎస్ మాట్లాడుతూ సభ్యులు ప్రస్తావించే అంశాలపై సంబంధిత శాఖలు తగిన సమాచారంతో సిద్ధంగా ఉండాలని, ప్రతి శాఖ తరఫున అసెంబ్లీలో ఒక నోడల్ అధికారిని నియమించి, ప్రశ్నలకు సమాధానాల తయారీ, సమాచార సేకరణ, సమన్వయం తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని సీఎస్ ఆదేశించారు. ఉన్నతాధికారులు, విభాగాధిపతులు అవసరమైన సమాచారంతో ముందస్తుగా సిద్ధంగా ఉండాలని, శాసనసభలో ఏదైనా ప్రశ్నకు సంబంధించి అదనపు సమాచారం అవసరమైన సందర్భంలో వెంటనే సంబంధిత శాఖల నుంచి వివరాలను సేకరించి, నిర్ణీత సమయంలో సమాధానం అందించే విధంగా సమన్వయ వ్యవస్థను పటిష్టం చేయాలని, పెండింగ్‌లో ఉన్న ప్రశ్నోత్తరాలకు సంబంధించిన సమాచారాన్నిఅసెంబ్లీ అధికారులకు వెంటనే అందజేయాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, నవీన్ మిట్టల్, బిఎండి ఎక్కా, వాణి ప్రసాద్, ముఖ్య కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, యోగితా రాణా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.