ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి : దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

నామ సంవత్సరం ఉగాదిలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆక్షించారు. మంగళవారం బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంలో యాదగిరి లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన ప్లవనామ ఉగాది పంచాంగాన్ని ప్రభుత్వ సలహాదారు రమణాచారితో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రి పంచాంగ పఠనం చేయగా.. కేంద్ర మాజీ మంత్రి, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ సభ్యులు వేణుగోపాలచారి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, రీజినల్ జాయింట్ కమిషనర్ క్రిష్ణవేణి కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ ప్లవనామ సంవత్సరంలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. షడ్రుచుల మేళవింపుతో కుటుంబాలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నిరాడంబరంగా ఉగాది పంచాంగ పఠన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా సమష్టిగా పోరాడి, కరోనాపై విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు. తెలుగువారి సంవత్సరాది ఉగాది అని, అయితే కరోనా మహమ్మారి దృష్ట్యా ప్రతి ఒక్కరూ సురక్షిత చర్యలు తీసుకోవాలని కోరారు.