- త్రాగు నీటి భద్రత పై ప్రత్యేక దృష్టి
- నీటి లభ్యత పెరగడంతో పాటు వినియోగం పెరుగుతుంది
- ఫ్లోరైడ్,నైట్రేట్ వంటి సమస్యాత్మక అంశాలపై ప్రత్యేక దృష్టి
భూగర్భ జలాల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు తాగునీటి భద్రత కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఫ్లోరైడ్, నైట్రేట్ వంటి సమస్యాత్మక అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన తెలిపారు. శుక్రవారం సాయంత్రం డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖా ప్రధాన కార్యదర్శి ఇ. శ్రీధర్,గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లక్ష్మణ్ ,డిప్యూటి డైరెక్టర్ పి.జ్యోతికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో భూగర్భ జలాల సంరక్షణ అన్నది అత్యంత ప్రాధాన్యతంశమని ఈ విషయంలో రైతులకు ప్రత్యెక అవగాహన కలిగించెందుకు అధికారులు చొరవ చూపాలని ఆయన సూచించారు. అదే సమయంలో నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా చూడడంతో పాటు వృధా గా పోయే నీటిని నియత్రించేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. తెలంగాణా రాష్ట్రంలో భూగర్భ జలాల లభ్యత పెరుగుతున్నప్పటికీ అదే స్థాయిలో నీటి వినియోగం పెరుగుతున్నందున నీటి వృధాను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. 2024 తో పోల్చిచూసినపుడు 2025 లో జలాల వినియోగం 45.93 శాతం నుండి 46.86 శాతానికి పెరిగిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. భూగర్భ జలాల సంరక్షణ అనేది ఒక ఉద్యమంలా ప్రజల్లోకి టిదుకెళ్లాలని నీటి సంరక్షణలో ప్రతీ ఒక్కరిని భాగస్వామ్యం చేయాల్సిన ఆవశ్యకతను ఆయన అధికారులకు వివరించారు. అధికంగా భూగర్భ జలాల వినియోగం అవుతున్న ప్రాంతాలలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా నియంత్రణ మీద దృష్టి సారించేయాలన్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టుకునెందుకు గాను ఇంకుడుగుంటల నిర్మాణాన్ని ఇబ్బడిముబ్బడిగా ప్రోత్సాహించాలని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భజలాల పరిమాణాలని నిరంతరం గుర్తించేందుకు వీలుగా 1,771 ఫిజోమిటర్లను వినియోగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పైగా భూగర్భ జలాల నియంత్రణతో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కు ఆదాయం లభిస్తుందన్నారు. పరిశ్రమలు, మైనింగ్ యూనిట్లు,అపార్టుమెంట్లు,ప్యాజ్డ్ డ్రింకింగ్ వాటర్ యూనిట్లకు భూగర్భ జలాల వినియోగానికి అనుమతులు ఇవ్వడం ద్వారా వినియోగ చార్జీల రూపంలో 25.80 కోట్లు గడించినట్లు ఆయన తెలిపారు.
జాతీయ హైడ్రాలోజి ప్రాజెక్టు అమలులో ఉత్తమ పనితీరు కనబర్చిన శాఖల్లో తెలంగాణా గ్రౌండ్ వాటర్ విభాగం ఒకటిగా గుర్తింపు పొందడం అభినందనీయమని, ఇకపై భూగర్భ జలాల నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కృత్రిమ మేధస్సు తో మరిన్ని సత్ఫాలితాలూ సాధించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధిక వినియోగ ప్రాంతాల్లో భూగర్భ జలాల వినియోగంపై నియంత్రణలు కఠినతరం చేయడంతో పాటు, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను మెరుగుపరచాలని, భూగర్భ జలాల వినియోగంపై శాఖల మధ్య సమన్వయంతో నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలో జిల్లా స్థాయి భూగర్భ జలాల కమిటీల సమావేశాలను జిల్లా కలెక్టర్లు నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు. భూగర్భ జలాల వినియోగం, రీచార్జ్ పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. 2025 సంవత్సరంలో రాష్ట్రంలో భూగర్భ జలాల రీచార్జ్ గణనీయంగా పెరిగిందని సమీక్షలో అధికారులు వెల్లడించారు.
2024లో 18.44 లక్షల హెక్టారు మీటర్లుగా ఉన్న వార్షిక రీచార్జ్ 2025లో 19.61 లక్షల హెక్టారు మీటర్లకు పెరిగి సుమారు 1.17 లక్షల హెక్టారు మీటర్ల వృద్ధి నమోదైంది. అయితే అదే సమయంలో భూగర్భ జలాల వినియోగం కూడా 8.45 లక్షల హెక్టారు మీటర్ల నుంచి 9.18 లక్షల హెక్టారు మీటర్లకు పెరిగినట్లు అధికారులు వివరించారు. తాజా భూగర్భ జలాల అంచనాల్లో అధిక వినియోగ ప్రాంతాలుగా గుర్తించిన గ్రామాల వివరాలను జిల్లా యంత్రాంగానికి అధికారికంగా పంపించి, అక్కడ కొత్త బోర్వెల్ తవ్వకాలు మరియు అదనపు భూగర్భ జలాల వినియోగాన్ని నియంత్రించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
రాష్ట్రంలోని 16 జిల్లాల్లో భూగర్భ జలాల ఒత్తిడి అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోనే ఎనిమిది మండలాలు అధిక వినియోగ కేటగిరీలో ఉన్నాయని వెల్లడించారు. ఇసుక తవ్వకాల అనుమతులకు ముందు భూగర్భ జలాల శాఖతో తప్పనిసరిగా సంప్రదింపులు జరపాల్సిన అవసరంపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,771 పైజోమీటర్లు, 352 పరిశీలనా బావులు, 921 కమాండ్ ఏరియా పరిశీలనా బావులు, 64 స్ట్రీమ్ఫ్లో చెక్పాయింట్ల ద్వారా భూగర్భ జలాల స్థాయిలను పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ బోర్వెల్ కార్యక్రమాల పురోగతినీ సమావేశంలో సమీక్షించారు. సబ్‌ప్లాన్ కింద మంజూరైన బోర్వెల్లను తవ్వి లబ్ధిదారులకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు చేస్తున్న భూగర్భ జలాల సంరక్షణ కార్యక్రమాలను అధ్యయనం చేసి తెలంగాణకు అనువైన వినూత్న ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూగర్భ జలాల మట్టాన్ని మెరుగుపరచడానికి భూగర్భ జలాల శాఖ, నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్ శాఖ, పరిశ్రమల శాఖల మధ్య మరింత సమన్వయం అవసరమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.