తెలంగాణ‌తో స‌హా ద‌క్షిణాదిలో ఎల్‌నినో ప్ర‌భావం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • సాధార‌ణం కంటే త‌గ్గ‌నున్న వ‌ర్ష‌పాతం
  • స‌హాయ చ‌ర్య‌ల కోసం ఉమ్మ‌డి జిల్లాకొకి ప్ర‌త్యేక అధికారి
  • నివార‌ణ చ‌ర్య‌ల కోసం ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌
  • కేంద్రానికి నివేదిక పంపి స‌హాయం కోరుతాం

హైద‌రాబాద్ : ఎల్‌నీనో ప్రభావం కారణంగా ఈ ఏడాది సాధారణం కంటే వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉంద‌ని, తెలంగాణ‌తో స‌హా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ, దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంద‌ని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్ల‌డించారు. ఎల్‌నీనో ప్రభావం నేపథ్యంలో చేపట్టాల్సిన ముందస్తు కార్యాచరణ, కంటింజెన్సీ ప్రణాళికలు, వివిధ శాఖల సంసిద్ధతపై మంగళవారం హనుమకొండ ఐడీఓసీ కలెక్టరేట్‌లో అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్షాభావ పరిస్థితులపై సమగ్రంగా చర్చించామ‌న్నారు.

వర్షాభావ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆయా జిల్లాల్లో వ్యవసాయం, తాగునీటి లభ్యత, భూగర్భ జలాలు, వర్షాభావ పరిస్థితులు తదితర అంశాలపై ఈ ప్రత్యేక అధికారులు నివేదికలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గానికి అందజేస్తార‌ని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారి దేవసేనను ప్రత్యేక అధికారిగా నియమించామ‌న్నారు. వర్షాభావ పరిస్థితుల నుంచి జిల్లాలను ఎలా గట్టెక్కించాలి, రైతులకు ఎలాంటి భరోసా కల్పించాలి, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింద‌ని మంత్రి తెలిపారు. ఈ వర్షాభావ పరిస్థితులపై సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించి, రాష్ట్రానికి అందాల్సిన సహాయం, కేంద్రం నుంచి పొందాల్సిన మద్దతుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రజలు, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ స‌మీక్షా సమావేశంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచంద్రనాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి,రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, మురళీ నాయక్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికారి, రాష్ట్ర కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన ఉమ్మడి వరంగల్ జిల్లాల కలెక్టర్లు,చాహత్ బాజ్‌పాయి, డా.సత్య శారద, హేమంత్ బొర్ఖడే సదాశివరావు, సందీప్ కుమార్ ఝా, రాహుల్ శర్మ, స్నేహ శబరీష్, ఆదనవు కలెక్టర్లు సంబంధిత శాఖలఉన్నతాధికారులు, కేవీకే–ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.